ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైసీపీ రాజకీయాలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీలు ఫ్యాక్షన్, కుటుంబ రాజకీయ పార్టీలుగా మారిపోయాయని ఆరోపించారు. ఏపీలో గత 15 ఏళ్లుగా రాజకీయాలు టీడీపీ, వైసీపీ చుట్టూనే తిరుగుతున్నాయని, ఈ రెండు పార్టీల మధ్య ప్రజలు నలిగిపోతున్నారని వ్యాఖ్యానించారు.టీడీపీని **‘రెడ్‌బుక్ పార్టీ’**గా, వైసీపీని **‘రప్పా రప్పా పార్టీ’**గా విజయసాయిరెడ్డి అభివర్ణించారు. రెండు పార్టీలకు దందాలు, సెటిల్‌మెంట్లు అలవాటుగా మారిపోయాయని ఆరోపించారు. ఎన్నికల సమయంలో భారీగా ఖర్చు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్‌లో తమిళనాడు తరహా రాజకీయాలు నడుస్తున్నాయని విజయసాయిరెడ్డి అన్నారు. టీడీపీ, వైసీపీ కుటుంబ రాజకీయాలకు పరిమితమయ్యాయని పేర్కొంటూ.. రాష్ట్రానికి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు కొత్త రాజకీయ పార్టీ అవసరమని ఆయన అన్నారు.తన రాజకీయ భవిష్యత్తుపైనా విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత రెండేళ్లుగా తాను రాజకీయంగా సైలెంట్‌గా లేనని స్పష్టం చేశారు. బాల్‌థాకరే తరహాలో తమ పార్టీకి తాను మెంటర్‌గా ఉంటానని చెప్పారు. కొత్త రాజకీయ వేదికలో చేరే వారికి ముఖ్యంగా దేశభక్తి ఉండాలని అన్నారు.
యువతకు రాజకీయాల్లో అధిక ప్రాధాన్యత ఇస్తామని విజయసాయిరెడ్డి ప్రకటించారు. 25 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న వారికి, 66 శాతం యువతకు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని తెలిపారు. అభ్యర్థుల కులంతో సంబంధం లేకుండా ప్రతిభ, అర్హత ఆధారంగా అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నట్లు ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.అమరావతి అభివృద్ధిపైనా విజయసాయిరెడ్డి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అమరావతికి మద్దతు ఇవ్వాల్సిందేనని, రాజధాని అభివృద్ధి కోసం ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలను ఆహ్వానించాలని సూచించారు. ప్రభుత్వ నిధులను వృథా చేయకుండా ప్రైవేట్ పెట్టుబడులను వినియోగించుకోవాలని అన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా ఆయన ప్రశ్నలు సంధించారు. గత 12 సంవత్సరాల్లో సుమారు రూ.12 లక్షల కోట్ల అప్పు చేశారని పేర్కొంటూ.. అప్పుగా తీసుకున్న సొమ్మంతా ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రభుత్వాలు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ అప్పులపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.అధికార పార్టీకి పోలీసులు అనుకూలంగా వ్యవహరించడం దురదృష్టకరమని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
టీడీపీ, వైసీపీ రెండూ ఆంధ్రప్రదేశ్‌కు ఆశించిన స్థాయిలో మేలు చేయలేదని ఆయన విమర్శించారు. ఈ రెండు పార్టీల రాజకీయ పోరాటంలో ప్రజా సమస్యలు పక్కకు వెళ్లిపోయాయని ఆరోపించారు. ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరమని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కొత్త పార్టీని నిర్మించాల్సిన అవసరం ఉందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.




