Monday, September 7, 2026

కేసీఆర్‌ వల్లే తెలంగాణలో నీళ్ల సమస్య.. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Must read

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్‌ఎల్‌బీసీతో పాటు కేసీఆర్‌ ప్రతిపాదిస్తున్న పాదయాత్రపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ పాదయాత్ర చేస్తే ప్రజలు నవ్వుకుంటారని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో భారీగా నష్టం జరిగిన తర్వాత కూడా కేసీఆర్‌ పాదయాత్ర చేస్తానని చెప్పడం ఏమిటని మంత్రి ప్రశ్నించారు. ఇరిగేషన్‌ రంగంలో కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాల వల్లే తెలంగాణ ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆరోపించారు. “నీళ్ల సమస్యకు రెండు కారణాలు.. కేసీఆర్‌, ఎల్‌నినో” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ హయాంలో ఇరిగేషన్‌ శాఖ పూర్తిగా దెబ్బతిన్నదని విమర్శించారు.

నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్‌ పనితీరు సున్నా అని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశారని పేర్కొంటూ.. ప్రాజెక్టును సరిగ్గా నిర్మించి ఉంటే ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలు వచ్చేవి కాదని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాలపై ఆయన పలు ప్రశ్నలు లేవనెత్తారు.

తుమ్మిడిహెట్టి నుంచి నీటిని తరలించే విషయంలో మార్పులు చేయడం ఘోర తప్పిదమని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. ఆ మార్పులు చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే ఉత్తర తెలంగాణ ప్రాంతం మరింత శస్యశ్యామలంగా మారేదని అన్నారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తికాకపోవడంపైనా మంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు. “ఎస్‌ఎల్‌బీసీ పూర్తయిందా? డిండి పూర్తయిందా?” అంటూ కేసీఆర్‌ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని ప్రస్తావించారు. మాట్లాడే సమయంలో అన్నీ తనకే తెలుసన్నట్లుగా కేసీఆర్‌ వ్యవహరిస్తారని, అయితే ఇరిగేషన్‌ విషయంలో ఆయన పనితీరు మాత్రం జీరో అని ఉత్తమ్‌ విమర్శించారు.

ఇరిగేషన్‌ అంశంలో కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లోనే ఉండటం మంచిదని మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని నీటిపారుదల పరిస్థితిపై కాంగ్రెస్‌ ప్రభుత్వం దృష్టి పెట్టిందని, గత ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

కేసీఆర్‌ మాట్లాడే భాషపైనా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పందించారు. అసెంబ్లీలో కేసీఆర్‌ అభ్యంతరకరమైన భాష ఉపయోగించినప్పుడు హీరోలాగా ఫీల్‌ అయ్యారని, అదే భాషను ఆయనపై ఉపయోగిస్తే మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య రాజకీయ భాషను చెడగొట్టింది కేసీఆర్‌ అని ఆరోపించారు.

బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య రాజకీయ సంబంధాలపైనా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్‌ బీజేపీకి సరెండర్‌ అయిందని ఆరోపిస్తూ.. బీజేపీకి బీఆర్‌ఎస్‌ లొంగిపోయినప్పుడు ఇక ఆ పార్టీపై ఎలాంటి చర్యలు ఉంటాయని ప్రశ్నించారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!