భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా రాయబారి సెర్జియో గోర్ ప్రశంసలు కురిపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలవాలనుకునే ప్రపంచ నేతల్లో మోదీ అగ్రస్థానంలో ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. భారత్-అమెరికా మధ్య రక్షణ, వాణిజ్యం, దౌత్య రంగాల్లో సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నాయని తెలిపారు.
డిసెంబర్‌లో అమెరికాలోని ఫ్లోరిడాలో జరగనున్న జీ20 సదస్సుకు ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం ఉందని సెర్జియో గోర్ వెల్లడించారు. అయితే మోదీ పర్యటన కేవలం జీ20 సమావేశానికే పరిమితం కాకపోవచ్చని ఆయన సంకేతాలు ఇచ్చారు. మోదీ, ట్రంప్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ట్రంప్ మోదీని తన స్నేహితుడిగా భావిస్తారని గోర్ పేర్కొన్నారు.
ట్రంప్ వచ్చే ఏడాది భారత్‌లో మరోసారి పర్యటించే అవకాశం ఉందని కూడా అమెరికా రాయబారి సంకేతాలు ఇచ్చారు. ట్రంప్‌తో తాను మాట్లాడిన ప్రతిసారీ 2020లో ఆయన భారత్ పర్యటన, ప్రధాని మోదీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటారని చెప్పారు. దీంతో భవిష్యత్తులో ట్రంప్ భారత్ పర్యటనకు సంబంధించిన అంచనాలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం కూడా పురోగతి దశలో ఉందని సెర్జియో గోర్ తెలిపారు. ఇరు దేశాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ ఒప్పందం ఉండబోతోందని అన్నారు. భారత్ ఆర్థికంగా అభివృద్ధి చెందడం అమెరికాకు కూడా ప్రయోజనకరమేనని పేర్కొన్నారు. భారత్‌లో స్థిరత్వం ఉండటం వల్ల ఆ దేశం అమెరికాకు మరింత ఆకర్షణీయమైన భాగస్వామిగా మారుతోందని చెప్పారు. ప్రధాని మోదీ దేశానికి స్థిరత్వాన్ని అందిస్తున్నారని గోర్ వ్యాఖ్యానించారు.
రక్షణ రంగంలో భారత్ తమకు విశ్వసనీయమైన భాగస్వామి అని అమెరికా రాయబారి స్పష్టం చేశారు. ఇరు దేశాల రక్షణ సంబంధాలు కేవలం ఆయుధాల కొనుగోళ్లు, విక్రయాలకు మాత్రమే పరిమితం కాలేదని అన్నారు. అమెరికా ప్రపంచంలోని ప్రతి దేశానికి రక్షణ పరికరాలను విక్రయించదని, అమెరికా విశ్వసించే దేశాల్లో భారత్ కూడా ఒకటని పేర్కొన్నారు. జావెలిన్ క్షిపణులు, అపాచీ హెలికాప్టర్ల సరఫరాను ఇందుకు ఉదాహరణలుగా ప్రస్తావించారు.
ఇదిలా ఉండగా.. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అక్టోబర్‌లో మరోసారి భారత్‌లో పర్యటించనున్నట్లు సెర్జియో గోర్ వెల్లడించారు. ఒకసారి పర్యటించిన కొన్ని నెలలకే అమెరికా విదేశాంగ మంత్రి మళ్లీ భారత్‌కు రావడం అరుదైన విషయమని ఆయన పేర్కొన్నారు. అమెరికా క్యాబినెట్‌కు చెందిన ఇతర మంత్రుల భారత పర్యటనలు కూడా ప్రణాళికలో ఉన్నాయని తెలిపారు.
అమెరికాలోని మూడు ప్రధాన రాష్ట్రాల గవర్నర్లు కూడా ఈ ఏడాది చివర్లో భారత్‌లో పర్యటించే అవకాశం ఉందని గోర్ చెప్పారు. మరోవైపు ఐక్యరాజ్యసమితి సమావేశాలు, జీ20 సదస్సులతో పాటు రాబోయే నాలుగు నెలల్లో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మూడు సార్లు అమెరికా పర్యటనకు వెళ్లే అవకాశం ఉందని వెల్లడించారు.
వరుసగా ఉన్నతస్థాయి పర్యటనలు, వాణిజ్య చర్చలు, రక్షణ సహకారం నేపథ్యంలో భారత్-అమెరికా సంబంధాలు మరింత విస్తరిస్తున్నాయని సెర్జియో గోర్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.




