కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులుగా ప్రజలను ద్రోహం, మోసం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తీవ్ర అంతర్గత సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోందని ఆరోపించారు. తెలంగాణలో గోదావరి, కృష్ణా నదుల్లో ప్రస్తుతం నీళ్లు పుష్కలంగా ఉన్నాయని, అయితే కృష్ణా నదిలో తెలంగాణకు ఉన్న నీటి హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
కొండా సురేఖ, కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన జగదీష్ రెడ్డి.. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలని అన్నారు. కొండా సురేఖ తమతో టచ్‌లో లేరని పేర్కొంటూ.. సుస్మిత చేసిన వ్యాఖ్యల వెనుక ఒక అవినీతి అనకొండ ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో జరిగిన ఈడీ సోదాల అంశాన్ని కూడా జగదీష్ రెడ్డి ప్రస్తావించారు. ఈడీ దాడులపై ఎందుకు స్పష్టమైన ప్రకటన చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర మంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దీవెనలు ఉన్నాయని ఆరోపించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాజకీయ ఓనమాలు కూడా తెలియవని విమర్శించారు.
పోలవరం ప్రాజెక్టు అంశంపై స్పందించిన ఆయన.. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా న్యాయపరమైన పోరాటం చేసిన పార్టీ బీఆర్ఎస్ అని గుర్తుచేశారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో తమ పార్టీ రాజీ పడదని స్పష్టం చేశారు. రాష్ట్ర నీటి హక్కులను కాపాడుకునేందుకు అవసరమైన పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.శాసనసభ ఎథిక్స్ కమిటీ వ్యవహారంపైనా జగదీష్ రెడ్డి స్పందించారు. కమిటీకి నిజాయితీ ఉండాలని, పార్టీ మారిన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా జరిగిన పరిణామాలపై వాస్తవాలను ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఇతర పార్టీల నాయకుల బీఆర్ఎస్‌లో చేరికలపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ బీఆర్ఎస్‌లోకి వచ్చినా చేర్చుకునే ప్రసక్తే లేదని, తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వబోమని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అప్లికేషన్ పెట్టుకున్నా పార్టీలోకి తీసుకోబోమని చెప్పారు. గతంలో ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిలు బీఆర్ఎస్‌లో చేరాలని ప్రయత్నించినప్పటికీ పార్టీ వారిని తీసుకోలేదని వెల్లడించారు.రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే.. ఆయన డబ్బులకు అమ్ముడుపోయినట్లేనని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలలో వారి క్యారెక్టర్‌ను బట్టి ఒకరిద్దరిని మినహాయించి మిగిలిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకునే అవకాశం లేదని తెలిపారు. ప్రస్తుతం పార్టీ మారిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల నాటికి పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరగకపోయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ కచ్చితంగా జరుగుతుందని జగదీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ప్రారంభమైందని, డీలిమిటేషన్ జరిగితే ఆ వ్యతిరేకత నుంచి బయటపడవచ్చని చంద్రబాబు భావిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశాలపై తెలంగాణ రాజకీయాల్లో మరింత చర్చ జరిగే అవకాశం ఉంది.




