ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం ఆవేదన వ్యక్తం చేసింది. విజయవాడలో నిర్వహించిన ఫోరం సమావేశంలో రాష్ట్రంలోని థియేటర్లకు ఎదురవుతున్న సమస్యలపై ఎగ్జిబిటర్లు విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా లైసెన్స్ విధానం, విద్యుత్ ఛార్జీలు, టికెట్ ధరలు, నిర్వహణ ఖర్చులు, OTT విడుదలలపై పలు కీలక అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
2 వేల నుంచి 1200కు థియేటర్లు
సీనియర్ ఎగ్జిబిటర్ యలమంచిలి రామచంద్రరావు మాట్లాడుతూ.. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 2 వేలకుపైగా సినిమా థియేటర్లు ఉండేవని, ప్రస్తుతం ఆ సంఖ్య సుమారు 1200కు పడిపోయిందని తెలిపారు. ముఖ్యంగా గత మూడు, నాలుగు నెలల్లోనే సుమారు 400 థియేటర్లు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.
థియేటర్ల నిర్వహణకు సంబంధించి ఫైర్, సినిమాటోగ్రఫీ తదితర వివిధ శాఖల నుంచి తీసుకోవాల్సిన లైసెన్సుల గడువులు వేర్వేరుగా ఉండటం వల్ల ఎగ్జిబిటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అన్ని శాఖలకు ఒకే విధంగా ఐదేళ్ల కాలపరిమితితో సింగిల్ విండో విధానంలో లైసెన్స్ రెన్యూవల్స్ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇండస్ట్రియల్ పవర్ టారిఫ్ కోరుతున్న ఎగ్జిబిటర్లు
సినిమా థియేటర్లకు కూడా టూరిజం, హోటల్ రంగాలకు వర్తించే విధంగా ఇండస్ట్రియల్ పవర్ టారిఫ్ అమలు చేయాలని ఎగ్జిబిటర్లు ప్రభుత్వాన్ని కోరారు. పెరుగుతున్న విద్యుత్ బిల్లులు, సిబ్బంది జీతాలు, థియేటర్ల ఆధునీకరణ, నిర్వహణ ఖర్చులు తమపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని తెలిపారు.
అదే సమయంలో థియేటర్ నిర్వహణ ఛార్జీలను కొంతమేర పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ అనే తేడా లేకుండా అన్ని కేటగిరీల థియేటర్లకు ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా యూనిఫామ్ టికెట్ ధరల విధానాన్ని సమీక్షించాలని కోరారు.
OTT విడుదలపై 8 వారాల నిబంధన
సినిమాలు థియేటర్లలో విడుదలైన తర్వాత కనీసం ఎనిమిది వారాల వరకు OTT ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల చేయకుండా నిబంధన తీసుకురావాలని ఎగ్జిబిటర్లు కోరారు. థియేటర్లలో సినిమా ప్రదర్శనకు తగిన సమయం లభిస్తేనే ఎగ్జిబిటర్లకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని, థియేటర్ల మనుగడ కోసం ఈ నిబంధన అవసరమని పేర్కొన్నారు.
టికెట్ ధరల పెంపునకు వ్యతిరేకం
టికెట్ ధరలను పెంచడం వల్ల ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ తరగతి ప్రేక్షకులు థియేటర్లకు దూరమవుతున్నారని ఏపీ ఎగ్జిబిటర్స్ ఫోరం జాయింట్ సెక్రటరీ తెలిపారు. టికెట్ రేట్లు పెంచకుండా విడుదలైన కొన్ని సినిమాలకు మంచి రెవెన్యూ వచ్చిందని ఉదాహరణగా పేర్కొన్నారు.
టికెట్ ధరల పెంపు వల్ల థియేటర్లకు పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని, అదనపు ఆదాయంలో ప్రధాన భాగం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు వెళ్తుందని వివరించారు. అందువల్ల ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు సంబంధించిన జీవోలు ఇవ్వకుండా ప్రేక్షకులకు అందుబాటులో ఉండే ధరలను కొనసాగించాలని కోరారు.
మెయింటెనెన్స్ ఖర్చులు భారీగా పెరుగుదల
మరోవైపు విద్యుత్ బిల్లులు, టాయిలెట్ల నిర్వహణ, సీటింగ్, ఏసీ, ఇతర సదుపాయాల మెయింటెనెన్స్ ఖర్చులు భారీగా పెరిగాయని ఎగ్జిబిటర్లు తెలిపారు. టికెట్ ధరలు అధికంగా ఉండటంతో ప్రేక్షకుల నుంచి థియేటర్ యాజమాన్యాలపై విమర్శలు వస్తున్నాయని పేర్కొన్నారు.
పెరిగిన నిర్వహణ వ్యయాలను దృష్టిలో ఉంచుకుని టికెట్ ధరలను భారీగా పెంచకుండా కేవలం థియేటర్ మెయింటెనెన్స్ ఛార్జీలను మాత్రమే పెంచుకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. థియేటర్ రంగంపై ఆధారపడిన వేలాది కుటుంబాల ఉపాధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తమ సమస్యలను సానుకూలంగా పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం విజ్ఞప్తి చేసింది.




