Friday, September 4, 2026

సోనియా గాంధీ ఆత్మకథకు కొత్త పబ్లిషర్.. నవంబర్ 10న ‘బెలాంగింగ్’ విడుదల

Must read

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రాజకీయ మెమోయిర్ **‘Belonging: A Journey of Love’**కు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. పుస్తకాన్ని భారత్‌లో ప్రచురించేందుకు ప్రముఖ ప్రచురణ సంస్థ హార్పర్‌కాలిన్స్ ఇండియా ముందుకొచ్చింది. 2026 నవంబర్ 10న ఈ పుస్తకాన్ని భారత్‌లో ప్రచురించనున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది.

వాస్తవానికి సోనియా గాంధీ మెమోయిర్‌ను భారత్‌లో ప్రచురించి, పంపిణీ చేసే బాధ్యతను పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా (PRHI) చేపట్టాల్సి ఉంది. అయితే మాన్యుస్క్రిప్ట్‌లోని కొన్ని భాగాలకు సంబంధించి సంపాదకీయ మార్పులు, తొలగింపులపై ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. చివరకు పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ఈ పుస్తకాన్ని భారత్‌లో ప్రచురించబోమని స్పష్టం చేసింది.

అయితే ఈ నిర్ణయంపై పెంగ్విన్ ఇండియా తనదైన వివరణ ఇచ్చింది. రచయిత సూచించిన మార్పులను అంగీకరించకపోవడం వల్లే పుస్తక ప్రచురణ నుంచి తప్పుకున్నామనే ప్రచారం సరైనది కాదని తెలిపింది. పుస్తకంలోని విషయాలను వాస్తవ నిర్ధారణ చేయడం, పుస్తక ప్రయోజనాలకు అనుగుణంగా అవసరమైన సంపాదకీయ సూచనలు చేయడం ప్రచురణ సంస్థ బాధ్యతలో భాగమని పేర్కొంది. చర్చలు కొనసాగినంతకాలం పుస్తకాన్ని ప్రచురించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని స్పష్టం చేసింది.

పెంగ్విన్ ఇండియా వైదొలగడంతో పలు భారతీయ ప్రచురణ సంస్థలు ఈ పుస్తకాన్ని ప్రచురించేందుకు ఆసక్తి చూపినట్లు సమాచారం. చివరకు హార్పర్‌కాలిన్స్ ఇండియాతో ఒప్పందం ఖరారైంది. హార్పర్‌కాలిన్స్ ప్రకారం.. ‘Belonging’ సమకాలీన రాజకీయ మెమోయిర్‌లలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుస్తకాల్లో ఒకటి. ప్రేమ, గుర్తింపు, బాధ్యత, అనుబంధం వంటి అంశాలతో పాటు భారతదేశ ప్రయాణంపై అరుదైన అంతర్గత దృక్పథాన్ని ఈ పుస్తకం అందించనుందని సంస్థ పేర్కొంది.

ఇదిలా ఉండగా.. పెంగ్విన్‌తో పుస్తక ప్రచురణ ఒప్పందం రద్దు కావడానికి సంబంధించిన అంశాలు రాజకీయంగా కూడా చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణల ప్రకారం.. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్, చైనా భారత భూభాగాన్ని ఆక్రమించిందన్న అంశాలకు సంబంధించిన కొన్ని భాగాలపై అభ్యంతరాలు వ్యక్తమైనట్లు పేర్కొన్నారు. మాజీ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా ఈ అంశంపై ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలకు పెంగ్విన్ ఇండియా భిన్నమైన వివరణ ఇచ్చింది. బాహ్య ఒత్తిడి కారణంగా నిర్ణయం తీసుకున్నామనే వాదనను ప్రచురణ సంస్థ అంగీకరించలేదు.

‘Belonging: A Journey of Love’లో సోనియా గాంధీ వ్యక్తిగత జీవితం, గాంధీ కుటుంబంలోకి ఆమె ప్రవేశం, రాజీవ్ గాంధీతో ఆమె అనుబంధం, రాజకీయాల్లోకి వచ్చిన తీరు, కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నిర్వహించిన బాధ్యతలు వంటి అనేక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల హత్యలు తన జీవితంపై చూపిన ప్రభావంతో పాటు 2004లో యూపీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి పదవిని స్వీకరించకూడదని తీసుకున్న నిర్ణయం వంటి రాజకీయంగా కీలకమైన ఘట్టాలపై కూడా ఈ మెమోయిర్‌లో వివరాలు ఉండనున్నట్లు సమాచారం.

పెంగ్విన్‌తో వివాదం నేపథ్యంలో ఇప్పటికే ఈ పుస్తకంపై రాజకీయ, సాహిత్య వర్గాల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పుడు హార్పర్‌కాలిన్స్ ఇండియా ప్రచురణ బాధ్యతలు చేపట్టడంతో నవంబర్ 10న వెలువడనున్న ‘Belonging’లో సోనియా గాంధీ ఎలాంటి వ్యక్తిగత, రాజకీయ అనుభవాలను వెల్లడించనున్నారనే అంశంపై మరింత ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!