Friday, September 4, 2026

హాలీవుడ్ నుండి విలన్స్‌ను దిగుమతి చేస్తోన్న టాలీవుడ్

Must read

ఒకప్పుడు తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి ఎదగాలంటే ఇతర దక్షిణాది పరిశ్రమల నుంచి నటీనటులను తీసుకురావడం సాధారణంగా కనిపించేది. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తెలుగు సినిమా మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుండటంతో.. టాలీవుడ్ మేకర్స్ తమ సినిమాల్లో కీలక పాత్రల కోసం విదేశీ నటులను కూడా సంప్రదిస్తున్నారు. ముఖ్యంగా విలన్ పాత్రలకు హాలీవుడ్ నటులను ఎంపిక చేసే ట్రెండ్ క్రమంగా పెరుగుతోంది.

తెలుగు సినిమాను అంతర్జాతీయ ప్రేక్షకులకు మరింత దగ్గర చేసిన చిత్రాల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఒకటి. ఈ సినిమాలో బ్రిటీష్ పాలన కాలానికి సంబంధించిన పాత్రల కోసం విదేశీ నటులను ఎంపిక చేశారు. గవర్నర్ స్కాట్ పాత్రలో రే స్టీవెన్సన్, ఆయన భార్యగా అలిసన్ డూడీ నటించారు. వీరి పాత్రలు సినిమాకు అంతర్జాతీయ లుక్‌ను తీసుకురావడంతో పాటు కథా నేపథ్యానికి కూడా సరిపోయాయి.

ఇక విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్న హై ఆక్టేన్ పీరియాడిక్ యాక్షన్ మూవీ **‘రణబాలి’**లోనూ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ‘ది మమ్మీ’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్నాల్డ్ వోస్లూ.. ‘రణబాలి’లో బ్రిటీష్ అధికారి సర్ థియోడర్ హెక్టర్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. 1854-1878 మధ్య బ్రిటీష్ పాలన, రాయలసీమ నేపథ్యంగా కథ సాగుతుండటంతో ఆ పాత్రకు విదేశీ నటుడిని తీసుకోవడం కథకు మరింత బలం చేకూర్చే అంశంగా మారింది.

మరోవైపు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమాలో కూడా విదేశీ నటుడిని తీసుకురావాలనే ఆలోచన జరిగినట్లు గతంలో వార్తలు వచ్చాయి. కొరియన్ స్టార్ డాన్ లీని సినిమాలోకి తీసుకురావాలనుకున్నప్పటికీ.. కథలో సరైన పాత్రను క్రియేట్ చేయలేకపోవడంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు మేకర్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు అందరి దృష్టి అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న **‘రాకా’**పై పడింది. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ను తీసుకురావాలని దర్శకుడు అట్లీ ప్లాన్ చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజమెంత అన్నది అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

కథకు అవసరమైన పాత్ర కోసమే విల్ స్మిత్‌ను తీసుకుంటున్నారా? లేక తెలుగు సినిమాకు హాలీవుడ్ మార్కెట్‌ను మరింతగా విస్తరించాలనే వ్యూహంలో భాగంగానే ఈ ఆలోచన చేస్తున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది. నిజంగా విల్ స్మిత్ ‘రాకా’లో భాగమయ్యాడా లేదా అన్న విషయం సినిమా టీజర్, ట్రైలర్ లేదా అధికారిక ప్రకటనతోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

‘ఆర్ఆర్ఆర్’తో మొదలైన విదేశీ నటుల ప్రయాణం.. ‘రణబాలి’ మీదుగా ‘రాకా’ వరకు వస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ ఇక పాన్ ఇండియా మాత్రమే కాదు.. పాన్ ఇంటర్నేషనల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!