కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క స్వయంగా రక్తదానం చేసి యువతకు, పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలిచారు.రక్తదానం అనంతరం కాంగ్రెస్ డాక్టర్స్ సెల్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ రాజీవ్ మంత్రి సీతక్కకు రక్తదాన ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, వైద్యులు, కార్యకర్తలు, యువజన ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, మానవీయ విలువలు, సేవాభావానికి ప్రతీకగా నిలిచిన నాయకుడని పేర్కొన్నారు. దేశంలో సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ, పేదలు, రైతులు, యువత, మహిళల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నారని కొనియాడారు.ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకోవడానికి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల మధ్యకు వెళ్లిన నాయకుడు రాహుల్ గాంధీ అని సీతక్క అన్నారు. రాజకీయాల్లో నిబద్ధత, నిజాయితీ, ప్రజాసేవకు ఆయన ఒక ఉదాహరణగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.నాయకుల జన్మదినాలను కేవలం వేడుకలుగా కాకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం కాంగ్రెస్ పార్టీ సంప్రదాయమని మంత్రి తెలిపారు. రక్తదానం అత్యంత గొప్ప సేవా కార్యక్రమమని, ఒక యూనిట్ రక్తం అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడగలదని అన్నారు.
యువత, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొనాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. సేవా దృక్పథంతో చేసే ప్రతి చిన్న కార్యక్రమం కూడా సమాజంలో గొప్ప మార్పుకు కారణమవుతుందని తెలిపారు.రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు, పేదలకు సహాయ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని మంత్రి సీతక్క పేర్కొన్నారు.




