తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె, ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ఆరోపించారు.
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను కొనసాగిస్తామని, మీటర్లు బిగించబోమని ముఖ్యమంత్రి చెబుతున్నారని పేర్కొన్న కవిత.. ఆ విషయాన్ని మీడియా చిట్‌చాట్‌లలో కాకుండా అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతుల్లో ఉన్న అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని సూచించారు.
రైతు డిస్కం ఏర్పాటు వెనుక మిగిలిన రెండు విద్యుత్ డిస్కంలను ప్రైవేటీకరించే కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఈ ప్రయత్నాలను అడ్డుకునేందుకు అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సోలార్ జీవో బడా కార్పొరేట్ సంస్థలకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా ఉందని కవిత విమర్శించారు. రైతులు, సామాన్య ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విధానాలు రూపొందించాలని కోరారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 18 రోజుల పసికందు చేయి కోల్పోయిన ఘటన అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి, ఖమ్మం జిల్లా మంత్రులు బాధ్యత వహించాలని, బాధిత చిన్నారి పేరిట రూ.25 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణకు దారితీసే ఎలాంటి చర్యలనైనా తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించే విధానాలను సహించబోమని హెచ్చరించారు. అవసరమైతే ఈ అంశంపై న్యాయపోరాటం కూడా చేస్తామని, రైతుల హక్కుల పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
రాష్ట్రంలో విద్యుత్ రంగం గత కొన్నేళ్లలో రైతులకు అనుకూలంగా అభివృద్ధి చెందిందని, రైతులకు నిరంతరాయంగా విద్యుత్ అందించడం వల్ల వ్యవసాయ ఉత్పత్తి పెరిగిందని కవిత పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో రైతులకు సంబంధించిన విధానాలను మార్చే ముందు ప్రభుత్వం అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
అలాగే లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును దసరా నాటికి ప్రతిపాదించకపోతే పాదయాత్ర చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగిస్తామని కవిత స్పష్టం చేశారు.



