Saturday, June 6, 2026
Google search engine

సీతక్కకు పురస్కారం అందజేసిన వెంకయ్య నాయుడు

Must read

శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి సీతక్క ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో జరిగిన ఈ ఘన కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి సీతక్కకు ఈ పురస్కారాన్ని అందజేశారు. వేలాది మంది విద్యార్థుల సమక్షంలో మంత్రి సీతక్క ఈ గౌరవాన్ని అందుకోవడం విశేషంగా నిలిచింది.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మహిళలు, చిన్నారుల సంక్షేమం కోసం మంత్రి సీతక్క అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, అధికారులు పాల్గొని మంత్రి సీతక్క సేవలను కొనియాడారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకోవడ గౌరవంగా భావిస్తున్నానని మంత్రి సీతక్క తెలిపారు. ప్రజాసేవలో సుదీర్ఘ అనుభవం కలిగిన వెంకయ్య నాయుడు గారంటే అందరికీ గౌరవమని, ఆయన సూచనలు దేశానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు.

విద్యార్థులను ఉద్దేశించి మంత్రి సీతక్క మాట్లాడుతూ సాధనతోనే విజయాలు సాధ్యమని, ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకుని కృషి చేయాలని సూచించారు. విద్యార్థి దశలో కష్టపడితే జీవితాంతం గౌరవంగా జీవించవచ్చని, ఇష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. చదువు మనిషి ఆత్మగౌరవాన్ని పెంచుతుందని, విద్యే శాశ్వతమని, దానిని ఎవరూ దొంగిలించలేరని స్పష్టం చేశారు.

తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ, పదో తరగతితో చదువు ఆపిన తాను తరువాత మళ్లీ విద్యను కొనసాగించి ఎల్‌.ఎల్‌.బి, ఎల్‌.ఎల్‌.ఎం, పీహెచ్‌డీ పూర్తి చేశానని తెలిపారు. ప్రజాసేవలో కొనసాగుతూనే చదువును ఎక్కడా ఆపలేదని పేర్కొన్నారు.

ములుగు జిల్లా పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో తొలి స్థానంలో నిలవడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. టీచర్లు క్రమశిక్షణతో పాఠాలు బోధించడం, అప్పటి జిల్లా కలెక్టర్ దివాకర్ మరియు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, సుప్రసిద్ధ జర్నలిస్ట్ వెంకట్ నారాయణతో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!