రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన లేఖ రాశారు. అసెంబ్లీలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలకు స్వయంగా మంత్రి లేఖలను అందజేస్తూ పర్యాటక అభివృద్ధిలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు శాసన సభ, మండలి కార్యదర్శుల కార్యాలయం ద్వారా లేఖలను పంపించారు.
తెలంగాణ అనాది చరిత్ర, అపూర్వ వారసత్వం, ప్రకృతి సౌందర్యానికి నిలయమని మంత్రి తెలిపారు. కాకతీయుల శిల్పకళ, ఆధ్యాత్మిక క్షేత్రాలు, నదులు, జలపాతాలు, అరణ్యాల అందాలు రాష్ట్ర ప్రత్యేకతను ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు. గుస్సాడి నుంచి పెరిణి, బతుకమ్మ నుంచి బొనాలు వరకు విస్తరించిన సాంస్కృతిక వైవిధ్యం తెలంగాణ గర్వకారణమని పేర్కొన్నారు.
ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాలకు సమీపంలోని పర్యాటక ప్రదేశాలను కనీసం రెండు రోజుల పాటు సందర్శించాలని మంత్రి కోరారు. ఆ ప్రాంతాల విశిష్టత, ప్రత్యేకతలను ప్రజలకు వివరించి పర్యాటకులను ఆకర్షించాలని సూచించారు. దీంతో ప్రజల్లో పర్యాటకంపై అవగాహన పెరిగి, రాష్ట్రానికి వచ్చే సందర్శకుల సంఖ్య పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
పర్యటనలకు సౌలభ్యం కల్పించేందుకు హరిత హోటళ్లలో వసతి కోసం ప్రత్యేక కూపన్లు అందజేస్తామని మంత్రి వెల్లడించారు. తెలంగాణ పర్యాటక, చారిత్రక, సాంస్కృతిక విశేషాలపై సమగ్ర డిజిటల్ సమాచారం, దృశ్య కంటెంట్‌ను త్వరలో ప్రజాప్రతినిధులకు అందజేయనున్నట్లు తెలిపారు.
పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి శక్తివంతమైన సాధనమని మంత్రి పేర్కొన్నారు. ఉపాధి అవకాశాల సృష్టి, గ్రామీణ అభివృద్ధి, కళాకారుల ప్రోత్సాహంలో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. అదేవిధంగా సామాజిక రుగ్మతలను తగ్గించడంలో కూడా ప్రజాప్రతినిధుల పాత్ర ముఖ్యమని సూచించారు.
ప్రజాకవి కాళోజీ నారాయణరావు చెప్పిన “నా తెలంగాణ కోటి రత్నాల వీణ” అనే వాక్యాన్ని ఉటంకిస్తూ, రాష్ట్ర వారసత్వాన్ని ప్రపంచానికి చాటాలని మంత్రి ఆకాంక్షించారు.



