Saturday, June 6, 2026
Google search engine

బంజారాహిల్స్ లో మహిళా భవన్ ప్రారంభం – మహిళలకు కొత్త అవకాశాలు

Must read

బంజారాహిల్స్ లోని ఎన్బిటి నగర్ లో 93.50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మహిళా భవన్ ను రాష్ట్ర మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రాంత మహిళలు భారీగా హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. అదే వేదికపై 29.80 లక్షల రూపాయలతో నిర్మించబోయే అంగన్వాడీ భవనానికి శంకుస్థాపన కూడా మంత్రులు, ప్రజాప్రతినిధులు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, రాష్ట్రంలో మహిళలు అభివృద్ధి దిశగా పయనిస్తున్నారని, 67 లక్షల మంది మహిళలు సంఘాల్లో భాగమై పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతున్నారని అన్నారు. ఆమె మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, మంత్రి పొన్నం ప్రభాకర్ సారధ్యంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ప్రారంభించామని గుర్తుచేశారు. గతంలో వైఎస్సార్ హయాంలో మహిళలకు పావలా వడ్డీతో రుణాలు ఇచ్చి లక్షాధికారులను చేసినట్లు చెప్పి, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని వివరించారు. బ్యాంకులు కూడా మహిళా సంఘాల నమ్మకాన్ని పెంచి ఎంత పెద్ద రుణమైనా ఇస్తున్నాయని, వడ్డీలేని రుణాలు అందిస్తూ మహిళలకు పెట్రోల్ బంకులు, ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, కుట్టు మిషన్లు, పిల్లలకు బట్టలు అందించే కార్యక్రమాలను ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా నిర్వహిస్తోందని చెప్పారు.

అలాగే మహిళా సంఘాల సభ్యులకు ఇన్సూరెన్స్ పథకం అమలు చేస్తున్నామని, ఏదైనా ప్రమాదం జరిగి సభ్యురాలు మరణిస్తే 10 లక్షల బీమా అందిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు 410 మంది మరణించగా 41 కోట్ల రూపాయల బీమా చెల్లించామని వివరించారు. సాధారణ మరణాల సందర్భంలో కూడా లోన్ ఇన్సూరెన్స్ పథకం ద్వారా రెండు లక్షల రూపాయల రుణ మాఫీ అమలు అవుతుందని చెప్పారు. మహిళా సంఘాలకు యూనిఫాం ఉండేలా చర్యలు తీసుకుంటూ చేనేత కార్మికులకు పని కల్పించి ఒక్కో మహిళకు రెండు చీరలు అందిస్తున్నామని తెలిపారు. పోషణ మాసాన్ని ప్రారంభించి గర్భిణీ స్త్రీలు బలవర్థకమైన ఆహారం తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. గతంలో అంగన్వాడీ టీచర్లకు సెలవులు లేకపోయినా ఇప్పుడు వేసవిలో కూడా హాలిడేస్ ఇచ్చామని, వారికి ఇంగ్లీష్ ట్రైనింగ్ కూడా అందించామని, గర్భిణీ స్త్రీలు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చినప్పుడు కింద కూర్చోకుండా బల్లలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

మహిళా శక్తి గురించి మాట్లాడుతూ సాధారణ మహిళల నుండి రాష్ట్ర స్థాయి వరకు ఎదిగిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయని, అందులో ఇందిరమ్మ ఉక్కు మహిళగా నిలిచిందని, ఎక్కడా రాజీ పడకుండా యుద్ధాల్లో కూడా నిలిచిన స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. అలాగే పెండింగ్ లో ఉన్న అర్పీల జీతాలను రెండు రోజుల్లో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 93 లక్షల రూపాయలతో నిర్మించిన మహిళా భవన్ ప్రారంభం, 30 లక్షల రూపాయలతో అంగన్వాడీ భవన శంకుస్థాపనతో ప్రాంత అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని మంత్రులు పేర్కొన్నారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!