తెలుగు సినీ రంగంలో విలక్షణ నటుడిగా తనదైన ముద్ర వేసుకున్న విజయవాడ ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మృతి దురదృష్టకరమే కాదు. తీవ్ర బాధకారం..సినీ రంగంలో ఆయన లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఈమేరకు కోట శ్రీనివాసరావు మృతికి సంతాపం తెలియజేస్తూ ఎంపీ కేశినేని శివనాథ్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
” తెలుగు చలనచిత్ర రంగంలో కోట శ్రీనివాసరావు ఒక ప్రత్యేకతరహా నటుడిగా ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ గుర్తు వుండిపోయే చిరస్మరణీయమైన వ్యక్తి. ఉమ్మడి కృష్ణాజిల్లా కంకిపాడు కి చెందిన కోటకి విజయవాడ తో ప్రత్యేక అనుబంధం వుంది. సినీరంగంలో రాణించిన కోట రాజకీయ రంగంలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు.. 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గా ప్రజాసేవ చేసి ప్రజానేతగా గుర్తింపు పొందారు. నటుడుగా అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో నంది అవార్డులు పొందారు.నాలుగన్నర దశాబ్దాల పాటు సినీ లోకంలో ఎన్నో వైవిద్యమైన పాత్రలతో పలు భాషల్లో 750 సినిమాల్లో నటించి ప్రేక్షకులరె అలరించి జాతీయ స్థాయి నటుడిగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం అందించే పద్మశ్రీ అవార్డ్ పొందటం ఎంతో విశేషం” అంటూ పేర్కొన్నారు.
కోట శ్రీనివాసరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు ఎంపి కేశినేని శివనాథ్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేయటంతోపాటు కోట మృతికి సంతాపం తెలియపర్చారు.




