AP Local Body Elections 2026 : ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఆదివారంతో నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా.. అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. అయితే, తాజాగా.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది.
Also Read : AP Local Body Elections : ఏపీ హైకోర్టులో వైసీపీ పిటిషన్ కొట్టివేత.. నామినేషన్ల గడువు పెంపునకు నో!
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునీత సోమవారం ఉదయం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,488 స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో 659 జడ్పీటీసీ స్థానాలు, 9,829 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయని తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా, నవంబర్ 3న పోలింగ్ జరుగుతుందని తెలిపారు.
అక్టోబర్ 21న రిటర్నింగ్ అధికారులు ఎన్నికల ప్రకటనలు జారీ చేస్తారని, అదేరోజు నుంచి అక్టోబర్ 23 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. నామినేషన్ పత్రాల పరిశీలన అక్టోబర్ 24న జరుగుతుంది. తిరస్కరణకు గురైన నామినేషన్లపై అక్టోబర్ 25న అప్పీళ్లు దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ అప్పీళ్లను అక్టోబర్ 26న పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అక్టోబర్ 27న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువుగా ప్రకటించారు. ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన అనంతరం అదేరోజు బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. దీంతో ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులపై స్పష్టత రానుంది.
నవంబర్ 3న జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అవసరమైన ప్రాంతాల్లో నవంబర్ 4న రీపోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 5న ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలతో పట్టణాల్లో రాజకీయ వాతావరణ హీటెక్కగా.. ఈ ఎన్నికలతో రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల్లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కనుంది.
ముఖ్యమైన తేదీలు ఇవే..
అక్టోబర్ 21 : నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
అక్టోబర్ 21, 22, 23 తేదీల్లో : నామినేషన్ల స్వీకరణ
అక్టోబర్ 24: నామినేషన్ల పరిశీలన
అక్టోబర్ 25: అప్పీళ్ల దాఖలు
అక్టోబర్ 26: అప్పీళ్ల పరిష్కారం
అక్టోబర్ 27: నామినేషన్ల ఉపసంహరణ, తుది అభ్యర్థుల జాబితా
నవంబర్ 3 : పోలింగ్
నవంబర్ 4: అవసరమైన చోట రీపోలింగ్
నవంబర్ 5: ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన


