X Video Kickstart Bonus : సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? అయితే, మీకు ఇది నిజంగానే ఉపయోగకరమైన వార్త. కేవలం 30 రోజుల్లో 15 వీడియోలు పోస్ట్ చేస్తే ఏకంగా రూ.2.85 లక్షలు వస్తాయి. ఈ ఆఫర్ ఇచ్చింది ఎవరో కాదు.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్). ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే.. వీడియోలకు లక్షల వ్యూస్ రావాల్సిన అవసరం లేకుండానే బోనస్ పొందే అవకాశం ఉండటం క్రియేటర్లను ఆకర్షిస్తోంది. అయితే, ఈ ఆఫర్ అందరికీ వర్తించదు.. కొన్ని ప్రత్యేక నిబంధనలు అమల్లో ఉంటాయని ‘ఎక్స్’ ప్రతినిధులు పేర్కొన్నారు. అసలు ఈ డబ్బు ఎవరికి వస్తుంది? డబ్బులు రావాలంటే ఏం చేయాలి? ‘ఎక్స్’ పెట్టిన కండిషన్లు ఏమిటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
సోషల్ మీడియా వేదికగా వీడియోలు రూపొందించే వారికి ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్ కొత్త అవకాశం తీసుకొస్తోంది. కేవలం 30రోజుల్లో 15 ఒరిజినల్ వీడియోలు పోస్ట్ చేస్తే 3,000 డాలర్లు.. అంటే సుమారు రూ.2.85 లక్షల బోనస్ అందించే ‘వీడియో కిక్‌స్టార్ట్ బోనస్’ను ఆ సంస్థ ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. అయితే, ఈ అవకాశం ప్రస్తుతం అందరికీ అందుబాటులో లేదు. ఎక్స్ నుంచి ఆహ్వానం అందుకున్న ఎంపిక చేసిన కంటెంట్ క్రియేటర్లు మాత్రమే ఇందులో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌కు పోటీగా ‘ఎక్స్’ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
‘వీడియో కిక్‌స్టార్ట్ బోనస్’ అనే స్పెషల్ ప్రోగ్రామ్ ద్వారా బోనస్ పొందాలంటే పాల్గొనే క్రియేటర్లు 30 రోజుల వ్యవధిలో కనీసం 15 వీడియోలను పోస్ట్ చేయాలి. అంతేకాదు, ఆ వీడియోలను 15 వేర్వేరు రోజుల్లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకేరోజులో 15వీడియోలు పోస్ట్ చేస్తామంటే ఉపయోగం ఉండదు. ప్రతి వీడియో నిలువుగా (వర్టికల్ ఫార్మాట్‌లో) ఉండాలి. దాని నిడివి మూడు నిమిషాల కంటే తక్కువగా ఉండాలి. వీడియోను స్వయంగా రూపొందించిన ఒరిజినల్ కంటెంట్ అయి ఉండాలి.
సాధారణంగా యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్ ద్వారా వచ్చే ఆదాయం వీడియోల వీక్షణలు, ప్రేక్షకుల స్పందన వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ‘ఎక్స్’ తీసుకొస్తున్న ఈ కొత్త ప్రోగ్రామ్ మాత్రం నిర్దేశించిన వీడియోల పోస్టింగ్ లక్ష్యాన్ని పూర్తి చేయడమే ప్రధాన అర్హత. ఎన్ని వ్యూస్ వచ్చాయి? ఎన్ని లైక్స్ వచ్చాయి? అనే అంశాల ఆధారంగా ఈ బోనస్‌ను నిర్ణయించరు. అర్హత పొందిన క్రియేటర్లు అవసరమైన షరతులు పూర్తి చేస్తే 3,000 డాలర్ల స్థిర బోనస్ పొందే అవకాశం ఉంటుంది.
క్రియేటర్లు గతంలో ఇతర సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేసిన తమ సొంత వీడియోలను కూడా ‘ఎక్స్’ లో అప్‌లోడ్ చేయవచ్చు. అయితే, వాటిపై ఇతర ప్లాట్‌ఫామ్‌ల వాటర్‌మార్క్‌లు, పేర్లు, లోగోలు ఉండకూడదు. ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ ప్రయోగాత్మక దశలో ఉంది. ఎక్స్ నుంచి ఆహ్వానం అందుకున్నవారే ఇందులో చేరగలరు. ఎవరిని ఎంపిక చేస్తారనే పూర్తి ప్రమాణాలను సంస్థ బహిరంగంగా వెల్లడించలేదు.
ఆహ్వానం పొందిన క్రియేటర్లు ఎక్స్ లోని Creator Studioలో ‘Programmes’ విభాగం ద్వారా నమోదు చేసుకోవాలి. తొలి విడతలో పాల్గొనడానికి 2026 అక్టోబర్ 30లోపు నమోదు పూర్తి చేయాలి. అయితే ఈ పథకానికి ప్రత్యేక అర్హతలు, నిబంధనలు వర్తిస్తాయి. వీడియో కిక్‌స్టార్ట్ బోనస్‌ను భవిష్యత్తులో మరింత మంది క్రియేటర్లకు అందుబాటులోకి తీసుకొస్తారా లేదా అన్న విషయంపై ‘ఎక్స్’ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.


