Kolkata Durga Puja Pandal Stampede : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో దుర్గాపూజ వేడుకల సమయంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉత్తర కోల్కతాలోని చోర్బగాన్ సార్వజనిన్ దుర్గాపూజ పండల్ వద్ద భారీగా భక్తులు గుమిగూడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 19మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 13 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. మరో 25 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Also Read : Madhya Pradesh : అర్ధరాత్రివేళ దారుణం.. భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 12 మంది మృతి
శనివారం రాత్రి సుమారు 7.40 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు కోల్కతా పోలీసులు వెల్లడించారు. వర్షం పడుతున్న సమయంలో పండల్ వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో రద్దీ పెరిగింది. ఈ క్రమంలో పండల్ నుంచి బయటకు వెళ్లే ద్వారం వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో పలువురు కిందపడిపోయి గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర వైద్య బృందాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను కలకత్తా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కూడా ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రుల పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. కోల్కతాలోనే ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించటానికి తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు.
ఈ దుర్ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించడంతోపాటు, బాధిత కుటుంబంలో ఒకరికి గ్రూప్-డి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. గాయపడిన వారికి కూడా ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యమని స్పష్టం చేశారు.
ఇదిలాఉంటే.. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు కలకత్తా హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దర్యాప్తు నేపథ్యంలో సంబంధిత పండల్ను మూసివేసి, ఘటనాస్థలాన్ని ఫోరెన్సిక్ నిపుణులకు అప్పగించారు.
పూజా నిర్వాహకులు లౌడ్స్పీకర్లో చేసిన ప్రకటనతో భక్తులు ఒక్కసారిగా కదలడంతో రద్దీ పెరిగి తొక్కిసలాటకు దారితీసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూజా నిర్వాహకులు, ప్రైవేటు భద్రతా సిబ్బంది, విధుల్లో ఉన్న ఇతర సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు. ఘటనాస్థలంలోని సీసీటీవీ దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నారు.


