నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో రాజకీయ విమర్శలు చేయడం సరికాదని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. వెటర్నరీ డాక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించి ‘సాక్షి’లో వచ్చిన కథనాలపై ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. కూటమి ప్రభుత్వం 160 వెటర్నరీ డాక్టర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతుంటే.. వాటిపై అనుమానాలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు.వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న సమయంలో ఒక్క వెటర్నరీ డాక్టర్ పోస్టును కూడా భర్తీ చేయలేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రస్తుతం పశుసంవర్ధక శాఖలో సుమారు 300 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అందులో మొదటి విడతగా 160 పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం ప్రభుత్వ విధానమని, నియామక ప్రక్రియపై రాజకీయ వివాదాలు సృష్టించడం వల్ల అభ్యర్థులే నష్టపోతారని అన్నారు.
వెటర్నరీ డాక్టర్ పోస్టుల భర్తీ విధానంపై కూడా మంత్రి వివరణ ఇచ్చారు. 2016లో జారీ చేసిన G.O.Ms.No.52 ప్రకారం మెరిట్, వెయిటేజీ ఆధారంగా ఎంపిక చేసే విధానం ఉందని చెప్పారు. మొత్తం 100 మార్కులకు BVSc మార్కులకు 60, MVSc అర్హతకు 10, ప్రభుత్వ లేదా ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్ట్ సేవలకు 10, గ్రాడ్యుయేషన్ పూర్తయినప్పటి నుంచి సీనియారిటీకి గరిష్ఠంగా 20 మార్కులు కేటాయించే విధానం ఉందని వివరించారు.మొదట ఈ పోస్టులను APPSC ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. అయితే గత ఎనిమిదేళ్లుగా నియామకాలు జరగకపోవడంతో ప్రస్తుతం పరీక్షా విధానం అమలు చేస్తే ఇంతకాలం ఎదురుచూసిన అభ్యర్థులకు నష్టం జరుగుతుందని వెటర్నరీ నిరుద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని కోరిందని చెప్పారు. కనీసం ఈ ఒక్కసారికి పాత వెయిటేజీ విధానాన్ని కొనసాగించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
అభ్యర్థుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, G.O.Ms.No.52లో ఉన్న విధానం ప్రకారం పరీక్ష లేకుండా మెరిట్, వెయిటేజీ ఆధారంగా నియామకాలు చేపట్టే అంశాన్ని పరిశీలించిందని మంత్రి చెప్పారు. అయితే ప్రస్తుతం ఉన్న పని ఒత్తిడి, పరీక్ష లేకుండా వెయిటేజీ విధానంలో నియామకాలు చేపట్టేందుకు అవసరమైన సమయం లేకపోవడం వల్ల APPSC ఈ ప్రక్రియను నిర్వహించలేమని తెలిపిందన్నారు.దీంతో G.O.Ms.No.22 ద్వారా ఈ ఒక్కసారికి మాత్రమే పాత విధానంలో పశుసంవర్ధక శాఖ ద్వారా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. భవిష్యత్తులో వెటర్నరీ డాక్టర్ పోస్టుల నియామకాలను APPSC ద్వారా పరీక్షా విధానంలోనే నిర్వహిస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిందన్నారు.
‘సాక్షి’ కథనంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్గా దామోదర్ నాయుడి పేరును ప్రస్తావించడంపైనా మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్గా లేరని, ఒక మహిళా అధికారి ఇన్చార్జి డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు. శాఖలో ప్రస్తుత అధికారుల వివరాలు తెలుసుకోకుండా కథనం రాయడం సరికాదని విమర్శించారు.వైసీపీ, దాని అనుకూల మీడియా ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై అనుమానాలు సృష్టిస్తోందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. నిరుద్యోగుల భవిష్యత్తును రాజకీయాలకు ఉపయోగించుకోవద్దని అన్నారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.అయితే నియామక విధానంపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న రాజకీయ ఆరోపణలకు సంబంధించి అధికారిక జీవోలు, నియామక నిబంధనలు, APPSC వైఖరి ఆధారంగా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుత వివాదంపై సంబంధిత వర్గాల అధికారిక వివరాలు కీలకంగా మారాయి.


