ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనను మరింత వేగవంతం చేయడంతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఫైళ్ల నిర్వహణను డిజిటల్ విధానంలోకి తీసుకెళ్లడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. కలెక్టర్ల సదస్సులో వివిధ పరిపాలనా అంశాలను సమీక్షించిన ఆయన.. అధికారుల పనితీరుపై కీలక సూచనలు చేశారు. సమావేశానికి గైర్హాజరైన అధికారుల నుంచి వివరణ తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌ను ఆదేశించినట్లు సమాచారం.కలెక్టర్ల సదస్సు రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించే వేదిక కావడంతో అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని సీఎం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కీలక సమావేశాలకు అధికారులు గైర్హాజరు కావడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఈ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. శాఖల పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, పెండింగ్‌లో ఉన్న అంశాలపై అధికారులు నిరంతరం దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం.
మరోవైపు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లను వేగంగా క్లియర్ చేయడంపై కూడా సీఎం ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రెండు రోజులు లేదా అంతకంటే తక్కువ సమయంలో ఫైళ్లను పరిష్కరించిన అధికారులను చంద్రబాబు అభినందించినట్లు తెలుస్తోంది. ప్రజలకు సంబంధించిన నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఫైళ్లు అనవసరంగా పెండింగ్‌లో ఉండకుండా నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించినట్లు సమాచారం.పరిపాలనలో జాప్యాన్ని తగ్గించేందుకు ఫైళ్ల నిర్వహణ విధానంలో కూడా మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఇకపై ఫైళ్ల నిర్వహణను ఆన్లైన్ విధానంలోనే చేపట్టాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మాన్యువల్ ఫైళ్లను కొనసాగించడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని అధికారులను హెచ్చరించినట్లు సమాచారం.
డిజిటల్ ఫైల్ వ్యవస్థ అమలు ఏ స్థాయిలో ఉంది? ఏ శాఖల్లో ఇంకా మాన్యువల్ విధానం కొనసాగుతోంది? ఆన్లైన్ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలు ఏమిటి? వంటి అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. నెల రోజుల్లో ఈ ప్రక్రియపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.పరిపాలనలో సాంకేతికత వినియోగాన్ని పెంచడం ద్వారా ఫైళ్ల కదలికలో పారదర్శకత, వేగం పెరగడంతో పాటు నిర్ణయాల అమలు కూడా వేగవంతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా ఒక శాఖ నుంచి మరో శాఖకు ఫైళ్ల బదిలీ, ఆమోద ప్రక్రియ, పెండింగ్ అంశాలపై పర్యవేక్షణ సులభతరం కావడానికి ఆన్లైన్ విధానం ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.ఇకపై ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ ఫైళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది. అధికారులు కేవలం సమావేశాలకు హాజరై నివేదికలు సమర్పించడం కాకుండా క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించేలా పనిచేయాలని ప్రభుత్వం ఆశిస్తోంది.


