క్విక్ కామర్స్‌లో పోటీ సెగ.. ఇన్‌స్టామార్ట్‌లో AI దెబ్బకు 340 మందికి లేఆఫ్..!

Must read

  • క్విక్ కామర్స్‌లో పోటీ సెగ.. ఇన్‌స్టామార్ట్ కీలక నిర్ణయం
  • స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో 340 మందికి ఉద్వాసన?
  • ఏఐతో పెరిగిన పని.. ఉద్యోగుల సంఖ్య తగ్గింపు

Swiggy Instamart Lays off : ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే నిమిషాల్లోనే ఇంటి దగ్గరకు సరుకులు తెచ్చిచ్చే క్విక్ కామర్స్ సంస్థల్లో పోటీ రోజురోజుకీ పెరుగుతోంది. కస్టమర్లను ఆకట్టుకోవడానికి కంపెనీలు కొత్త కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి.

ఈ క్రమంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీకి చెందిన ఇన్‌స్టామార్ట్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వ్యాపారంలో నష్టాలను తగ్గించుకోవడంతో పాటు కార్యకలాపాలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు సుమారు 340 మంది ఉద్యోగులను తగ్గించాలని యోచిస్తున్నట్లు మనీకంట్రోల్ నివేదించింది..

ఏఐతో పని.. ఉద్యోగులకు షాక్ :
ఈ ఉద్యోగాల కోత ప్రధానంగా కార్పొరేట్, సపోర్ట్ విభాగాల్లో పనిచేస్తున్న వారిపై ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ తన కార్యకలాపాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని పెంచుతోంది. టెక్నాలజీ సాయంతో పనులను వేగంగా పూర్తి చేయడం, నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడం ఈ మార్పుల వెనుక ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.

ఏఐ వల్లే ఉద్యోగాల కోత జరుగుతోందని కంపెనీ స్పష్టంగా వెల్లడించలేదు. ఉద్యోగాలు కోల్పోయే వారికి పరిహార ప్యాకేజీలతో పాటు కొత్త ఉద్యోగాలు వెతుక్కునేందుకు అవసరమైన సాయం, ఇతర ప్రాంతాలకు మారేందుకు ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్లు రిపోర్టు పేర్కొంది.

పోటీ ఎక్కువ.. నష్టాల భారం :
మరోవైపు ఇన్‌స్టామార్ట్‌కు మార్కెట్లో గట్టి పోటీ ఎదురవుతోంది. బ్లింకిట్, జెప్టో, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్, అమెజాన్ నౌ వంటి సంస్థలు వేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో మార్కెట్‌లో నిలదొక్కుకోవడం కంపెనీలకు సవాలుగా మారింది..

స్విగ్గీ 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.922 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.1,092 కోట్లతో పోలిస్తే నష్టం తగ్గినా, అంతకుముందు త్రైమాసికంలోని రూ.791 కోట్లతో పోలిస్తే పెరిగింది..

కొత్త వ్యూహాలతో ముందుకు :
కొత్త సీఈఓ నందితా సిన్హా నాయకత్వంలో ఇన్‌స్టామార్ట్ వ్యాపార వ్యూహాలను మార్చుకుంటోంది. ప్రైవేట్ లేబుల్స్‌పై ఫోకస్ పెడుతూ ఖర్చులను అదుపులో పెట్టుకోవాలని చూస్తోంది. మొత్తానికి ఏఐ వినియోగం, ఉద్యోగుల కోతలు, కొత్త వ్యాపార వ్యూహాలతో ఇన్‌స్టామార్ట్ భవిష్యత్తును తిరిగి నిర్మించుకునే ప్రయత్నం చేస్తోంది..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article