Kalvakuntla Kavitha: రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి ఆడబిడ్డలు ముందుకు రావాలని, ఒకరి కోసం ఎదురుచూడకుండా మన చరిత్ర మనమే రాసుకోవాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తానేమీ టైంపాస్‌కు పార్టీ పెట్టలేదని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రక్షణసేన ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య కళానిలయంలో నిర్వహించిన ‘మహిళలు-రాజ్యాంగం’ సదస్సులో ఆమె మాట్లాడారు. గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ఏ ఎన్నికల్లో పోటీ చేయడానికి మహిళలు ముందుకొచ్చినా, ఆర్థికంగా, ఇతర రకాలుగా పూర్తి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఇకపై ‘తెలంగాణ రుద్రమసేన’గా మహిళా విభాగం:
తెలంగాణ రక్షణసేన మహిళా విభాగాన్ని ఇకపై ‘తెలంగాణ రుద్రమసేన’గా కొనసాగిస్తున్నట్లు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) ప్రకటించారు. ఈ సందర్భంగా రూపొందించిన ‘తెలంగాణ రుద్రమసేన’ గోడపత్రికలను మహిళా నేతలతో కలిసి ఆమె ఆవిష్కరించారు. మహిళా శక్తిని సంఘటితం చేసి, ప్రతి స్థాయిలోనూ ప్రాతినిధ్యం కల్పించేలా ఈ విభాగం పనిచేస్తుందని తెలిపారు.
దాడులను ధైర్యంగా ఎదుర్కోవాలి:
రాజకీయాల్లోకి అడుగుపెట్టే మహిళలపై వ్యక్తిగత విమర్శలు, అసభ్యకర వ్యాఖ్యలతో దాడులు జరిగే అవకాశం ఉంటుందని కవిత పేర్కొన్నారు. అలాంటి దాడులకు ఎవరూ భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతో మహిళలు రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు.




