Telangana Govt : తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన పేదలకు సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం వివిధ రకాల పెన్షన్లను అందిస్తోంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు తదితర అర్హులైన వర్గాలకు ప్రభుత్వం ప్రతీ నెలా పెన్షన్ సాయం అందిస్తోంది. ఇటీవల కొత్తగా ఎంపికైన సుమారు 4.89లక్షల మంది లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో పెన్షన్ డబ్బులు జమచేసే ప్రక్రియను నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
అయితే సాంకేతిక సమస్యల కారణంగా కొందరి ఖాతాల్లో నగదు జమ కాలేదని సమాచారం. ఒకేసారి పెద్ద సంఖ్యలో లబ్ధిదారుల ఖాతాలకు నగదు బదిలీ జరుగుతున్న నేపథ్యంలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల కొంతమందికి వెంటనే డబ్బులు జమ కాకపోవచ్చు. అలాంటి వారికి నేడు సాయంత్రంలోగా డబ్బులు క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది. ఖాతాలో నగదు జమైతే మొబైల్కు బ్యాంకు నుంచి మెసేజ్ వస్తుంది. మెసేజ్ రాకపోతే సంబంధిత వెబ్సైట్లో పెన్షన్ ఐడీ లేదా ఆధార్ నంబర్ నమోదు చేసి చెల్లింపు వివరాలు తెలుసుకోవచ్చు.
ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన చేయూత పెన్షన్ వెబ్సైట్ ద్వారా మీ పెన్షన్ వివరాలను తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీ దగ్గర పెన్షన్ ఐడీ లేదంటే ఆధార్ ఐడీ ఉండాల్సి ఉంటుంది.
పెన్షన్ స్టేటస్ చెక్ చేసుకునే విధానం ఇలా..
తొలుత మీ ఫోన్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి.
ప్రభుత్వ అధికారిక పెన్షన్ వెబ్సైట్ cheyutha pension సందర్శించండి.
ఆ తరువాత Search Pensioner Details పై క్లిక్ చేయండి.
చేయూత పెన్షన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.
అందులో పెన్షన్ ఐడీ కార్డు లేదంటే ఆధార్ నంబర్ నమోదు చేయాలి. ఆ తరువాత జిల్లా, మండలం, పంచాయతీ, పెన్షనర్ పేరు, తదితర వివరాలను పూర్తి చేసి సర్చ్ ఆప్షన్ పై నొక్కాలి.
ఆ తరువాత మీ పెన్షన్ కు సంబంధించిన వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.
అక్కడ చూపించే వివరాలను పరిశీలించి మీ పెన్షన్ స్థితిని తెలుసుకోవచ్చు.
పెన్షన్ డబ్బులు పడకుంటే ఇలా చేయండి..
కొత్తగా పెన్షన్ మంజూరైనప్పటికీ మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు జామకాకపోతే బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ అనుసంధానం, చెల్లింపు స్థితి వంటి అంశాలు ముఖ్యమైనవి. ముందుగా పెన్షన్ కోసం నమోదు చేసిన బ్యాంకు ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తెలుసుకోండి. ఎస్ఎంఎస్ కోసం మాత్రమే ఎదరుచూడకండి. బ్యాంకు మినీ స్టేట్ మెంట్ లేదంటే మొబైల్ బ్యాంకింగ్ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. డబ్బులు మీ ఖాతాలో జమకాకుంటే సంబంధిత అధికారుల సూచనలను అనుసరించాలి. ముందుగా గ్రామ పంచాయతీ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం లేదంటే సంబంధిత పెన్షన్ అధికారులను సంప్రదించండి.




