రాంనగర్ చేపల మార్కెట్‌లో ఆకస్మిక సోదాలు.. కుళ్లిన చేపలు స్వాధీనం.. నిబంధనలు పాటించని వ్యాపారులపై కఠిన చర్యలు!

Must read

FSSAI Raid On Fish Market: హైదరాబాద్‌లోని కవాడిగూడ రాంనగర్ చేపల మార్కెట్‌లో ఫుడ్‌సేఫ్టీ, వెటర్నరీ అధికారులు, పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిల్వ ఉంచిన కుళ్లిన చేపలను స్వాధీనం చేసుకున్నారు. దుకాణాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు వ్యాపారుల వద్ద కేవలం ట్రేడ్ లైసెన్సులు మాత్రమే ఉన్నాయని, తప్పనిసరిగా ఉండాల్సిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ లేదని గుర్తించి కుళ్లిన చేపలు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి చేపల వ్యాపారి తప్పనిసరిగా ఫుడ్‌సేఫ్టీ లైసెన్స్ పొందాలని అధికారుల బృందం స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ నిబంధనల అమలుపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది.

బేగంబజార్, రాంనగర్ మార్కెట్లలో తనిఖీలు.. రసాయనాల వినియోగంపై పరిశీలన:

నగరంలోని చేపల మార్కెట్లపై స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా బేగంబజార్, రాంనగర్ మార్కెట్లలో చేపల నాణ్యత, నిల్వ విధానాలను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నామని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ మనోజ్ తెలిపారు. చేపలను తాజాగా ఉంచేందుకు రసాయనాలు వాడుతున్నారా అనే కోణంలో తనిఖీలు( FSSAI Raid On Fish Market) చేసి ఫార్మాలిన్ వినియోగంపై ఎస్ఎఫ్ఎల్ ద్వారా పరీక్షలు నిర్వహించామని, మార్కెట్లలో అపరిశుభ్రతను గుర్తించామని ఆయన వివరించారు. స్వాధీనం చేసుకున్న కుళ్లిన చేపలను ధ్వంసం చేయడానికి పంపించామని, లైసెన్సులు లేని వ్యాపారులకు నోటీసులు జారీ చేసి నిర్ణీత గడువులోపు పరిశుభ్రంగా అమ్మకాలు చేపట్టాలని ఆదేశించామని పేర్కొన్నారు.

ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్.. వినియోగదారులకు సూచనలు:

ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా టీజీ సేఫ్ ఫుడ్ అధికారులు ప్రత్యేక తనిఖీ డ్రైవ్ నిర్వహిస్తున్నారని, ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని వ్యాపారులపై చర్యలకు సిద్ధమయ్యామని తెలిపారు. వ్యాపారులు నిబంధనల ప్రకారం తప్పనిసరిగా లైసెన్సులు తీసుకోవాలని, నిర్ణీత గడువులోపు హైజెనిక్ పద్ధతుల్లోనే వ్యాపారాలు నిర్వహించాలని అధికారులు మరోసారి స్పష్టం చేశారు. వినియోగదారులు చేపలు కొనుగోలు చేసేటప్పుడు సజీవంగా ఉన్న లైవ్ చేపలను మాత్రమే గమనించి తీసుకోవాలని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ మనోజ్ ప్రజలకు సూచించారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article