IND vs NZ : ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించడంతో న్యూజిలాండ్ 41 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ముందు 135 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది.
న్యూజిలాండ్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ (55; 104 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (31; 38 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించాడు. మిగిలిన వారిలో హెన్రీ నికోలస్ (11) ఒక్కడే రెండు అంకెల స్కోరు సాధించాడు. విల్ యంగ్ (6), టిమ్ సీఫెర్ట్ (0), టామ్ లాథమ్ (7), గ్లెన్ ఫిలిప్స్ (0), నాథన్ స్మిత్ (3) లు ఘోరంగా విఫలం అయ్యారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్ నాలుగు వికెట్లు తీశాడు. అకిల్ నబీ, అక్షర్ పటేల్, అన్షుల్ కాంబోబ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. భారత బౌలర్ల ధాటికి కివీస్ 53 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో సీనియర్ ఆటగాడు డారిల్ మిచెల్, కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. వీరిద్దరు క్రీజులో కుదురుకునేందుకే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో పరుగుల రాక మందగించింది. ఓ దశలో టెస్టు ఇన్నింగ్స్‌ను తలపించింది.
క్రీజులో కుదురుకున్న తరువాత మిచెల్ అడపాదడపా బౌండరీలు బాదుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే.. అర్థశతకం అనంతరం భారీ షాట్‌కు యత్నించి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. మిచెల్, సాంట్నర్లు ఆరో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తరువాత కొద్ది సేపటికే సాంట్నర్ కూడా పెవిలియన్‌కు చేరుకున్నాడు. అనంతరం కివీస్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ సేపు పట్టలేదు.


