IND vs NZ : ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వెల్లింగ్టన్ వేదికగా శనివారం రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. తొలి వన్డేలో విజయం సాధించిన భారత్ రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్‌లో ఆధిక్యాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. మరోవైపు తొలి వన్డేలో ఓటమి పాలైన న్యూజిలాండ్ జట్టు రెండో వన్డేలో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని గట్టి పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.
ఇక ఈ మ్యాచ్‌కు కూడా వరుణుడి ముప్పు పొంచి ఉందని అంటున్నారు. ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌కు సైతం వరుణుడు పలుమార్లు ఆటంకం కలిగించిన సంగతి తెలిసిందే.
ఇక తొలి వన్డేలో విఫలమైన రోహిత్ శర్మ రెండో వన్డేలో రాణించాలని ఫ్యాన్స్‌తో పాటు టీమ్‌మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీలు ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసి వచ్చే అంశం. అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, అన్షుల్ కాంబోజ్‌లతో కూడిన పేస్ దళం తొలి వన్డేలో ఆకట్టుకుంటుంది. ఇక రెండో వన్డేకు మహ్మద్ సిరాజ్ అందుబాటులోకి వచ్చాడు. దీంతో అన్షుల్, గుర్నూర్‌లలో ఒకరు బెంచీకే పరిమితం కావొచ్చు.
జియోలో రాదు..
వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న రెండో వన్డే మ్యాచ్ జియో హాట్‌స్టార్‌లో రాదు. ఈ సిరీస్ ప్రసార హక్కులను సోనీ నెట్‌వర్క్ కలిగి ఉంది. దీంతో రెండో వన్డే మ్యాచ్ టీవీలో సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇక ఓటీటీలో అయితే.. సోనీ లివ్ యాప్, వెబ్‌సైట్‌లో స్ట్రీమింగ్ కానుంది.


