- హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్
- మెట్రో, ఆర్టీసీ ప్రయాణికులకు భారీ ఊరట లభించనుంది
- డైలీ, మంత్లీ పాస్ ధరలు భారీగా తగ్గనున్నాయి
- కామన్ పాస్‌పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
Metro-RTC common Pass : హైదరాబాద్‌లో ప్రతిరోజూ మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణ ఖర్చులు తగ్గించడంతో పాటు ప్రజా రవాణాను మరింత అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్ ధరలను తగ్గించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో ఇప్పటివరకు ఎక్కువ ధర ఉందని భావించిన ప్రయాణికులకు భారీ ఊరట లభించనుంది.. ఇంతకీ కామన్ పాస్ ఎంత తగ్గనుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
నెలవారీ పాస్‌పై ఏకంగా రూ.4 వేల తగ్గింపు? :
ప్రస్తుతం నెలవారీ కామన్ పాస్ ధర రూ.8,500గా ఉంది. అయితే, తాజాగా ప్రతిపాదించిన ధరల ప్రకారం.. ఇకపై ఈ పాస్‌ను రూ.4,500కే అందుబాటులోకి తీసుకురానున్నారు. అంటే.. ఒక్క నెలలోనే ప్రయాణికులకు రూ.4వేలు ఆదా కానుంది. ఇక రోజువారీ పాస్ ధర కూడా రూ.400 నుంచి రూ.325కు తగ్గనుంది. దాంతో అప్పుడప్పుడు మెట్రో, బస్సులు ఉపయోగించే వారికి కూడా భారీగా డబ్బులు ఆదా అవుతాయి..
Read Also :
ఒకే పాస్‌తో మెట్రో, ఆర్టీసీ ప్రయాణం :
ఈ కామన్ పాస్ ప్రత్యేకత ఏంటంటే.. ఒకే పాస్‌తో హైదరాబాద్ మెట్రో రైలు, టీజీఎస్ఆర్టీసీకి చెందిన అర్హత ఉన్న సిటీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. మెట్రో టికెట్, బస్సు టికెట్ అంటూ విడివిడిగా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. నిర్ణీత ఆపరేటింగ్ ప్రయాణ వేళల్లో అర్హత పొందిన సేవల్లో అపరిమితంగా ప్రయాణం చేయొచ్చు.. అయితే, పుష్పక్ బస్సులకు ఈ పాస్ వర్తించదు..
గతంలో ఈ రెండు రవాణా వ్యవస్థలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే ఉద్దేశంతో 2026 అక్టోబర్‌లో కామన్ పాస్ సౌకర్యాన్ని ప్రారంభించారు. అయితే ధర ఎక్కువగా ఉందని ప్రయాణికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ధరల తగ్గింపుపై దృష్టి పెట్టింది..
అధికారిక ఉత్తర్వుల కోసం ఎదురుచూపులు :
తగ్గించిన ధరలతో మరింత మంది ప్రజా రవాణాను ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే, కొత్త ధరలకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు ఇంకా వెలువడాల్సి ఉంది. ఆదేశాలు వచ్చిన తర్వాతే కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. అప్పటివరకు వేచి చూడాల్సిందే..


