Vande Bharat Sleeper Food Menu: దూరప్రాంత రాత్రి ప్రయాణాలకు సరికొత్త అనుభూతిని అందిస్తున్న వందే భారత్ స్లీపర్ రైళ్లలో ప్రయాణించేవారికి ఐఆర్సీటీసీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇటీవల రైళ్లలో అందించే ఆహారం నాణ్యత, రుచిపై ప్రయాణికుల నుంచి వరుస ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో క్యాటరింగ్ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎక్కువ సంఖ్యలో రకరకాల పదార్థాలు వడ్డించడం కాకుండా, ఎంపిక చేసిన తక్కువ వంటకాలనే (Vande Bharat Sleeper Food Menu)మరింత నాణ్యత, పరిశుభ్రతతో అందించాలని సంకల్పించింది. ముఖ్యంగా విమానయాన సంస్థల తరహా క్యాటరింగ్ నమూనాను అనుసరిస్తూ ప్రత్యేక కిచెన్లలో వంటలు సిద్ధం చేయనుంది. దీనివల్ల సిబ్బందికి ఆహార తయారీ, ప్యాకేజింగ్, సరఫరా ప్రక్రియ మరింత సులభతరం కావడంతో పాటు ప్రయాణికులకు తాజా ఆహారం అందుతుందని అధికారులు భావిస్తున్నారు.
మెనూలో కోతలు.. తగ్గిన మీల్ బరువు.. ఏమేం మార్చారంటే?
కొత్త మెనూ ప్రకారం అల్పాహారం, భోజనాల జాబితాలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, వడతో పాటు చట్నీ, సాంబార్ లేదా పోహా, ఉప్మా అందిస్తారు. గతంలో ఇచ్చే సూప్, ఆమ్లెట్, శాండ్విచ్, మజ్జిగ, చాక్లెట్ వంటి అదనపు వంటకాలను తొలగించారు. మధ్యాహ్నం భోజనంలో చపాతీ, అన్నం, పప్పుతో పాటు వెజ్ లేదా నాన్‌వెజ్ ప్రధాన వంటకం ఉంటుంది. రాత్రి డిన్నర్లో పెరుగు, సలాడ్, ఊరగాయ, పొడి కూరగాయలు, స్వీట్లను తీసేశారు. అదనపు ఐటెమ్‌లు తగ్గించడంతో గతంలో 700–750 గ్రాములు ఉన్న మీల్ బరువు ఇప్పుడు 450–500 గ్రాములకు చేరింది. అయినప్పటికీ ప్రధాన వంటకాల క్వాంటిటీలో ఎలాంటి తగ్గింపు లేదని ఐఆర్సీటీసీ స్పష్టం చేసింది.
పైలట్ ప్రాజెక్టుగా మూడు రూట్లలో అమలు.. ఫీడ్‌బ్యాక్ తర్వాతే పూర్తిస్థాయిలో:
విమానాలు, ప్రముఖ హోటళ్లకు భోజనం సరఫరా చేసే సంస్థల భాగస్వామ్యంతో ఐఆర్సీటీసీ ఈ సరికొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ప్రస్తుతం దేశంలో నడుస్తున్న ముంబై–బెంగళూరు, హౌరా–కామాఖ్య, ఢిల్లీ–వారణాసి వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఈ కొత్త మెనూను అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందన, అభిప్రాయాలను సేకరించిన అనంతరం ఇతర మార్గాల్లోనూ విస్తృతంగా అమలు చేసే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.




