భాద్రపద మాసం శుక్లపక్షం చవితి రోజున జరుపుకునే పర్వదినమే వినాయక చవితి. హిందూ సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన పండుగల్లో ఇది ఒకటి. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజించి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖసంతోషాలు కలగాలని భక్తులు కోరుకుంటారు. భాద్రపద శుద్ధ చతుర్థి రోజున గణపతి జననం జరిగిందని ఒక గాథ ప్రచారంలో ఉండగా, అదే రోజున వినాయకుడికి విఘ్నాధిపత్యం లభించిందని మరో కథనం చెబుతుంది.వినాయక చవితి రోజున ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకుని, తలంటు స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించడం ఆనవాయితీ. ఇంటికి మామిడాకుల తోరణాలు కట్టి, పూలతో అలంకరించిన అనంతరం పూజా స్థలాన్ని సిద్ధం చేస్తారు. పీటకు పసుపు రాసి, ఇంటి ఈశాన్య లేదా ఉత్తర దిక్కులో బియ్యం పోసిన పళ్లెంపై తమలపాకులు ఉంచి వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. దీపారాధన, ధూపారాధన అనంతరం గణపతిని పూజిస్తారు.
వినాయక వ్రత కథలో గజాసురుడి కథకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. గజాసురుడు పరమశివుడి కోసం తీవ్ర తపస్సు చేసి, శివుడు తన ఉదరంలో నివసించాలని వరం కోరుకుంటాడు. శివుడు అతని కోరికను అంగీకరించడంతో పార్వతీదేవి ఆందోళన చెందుతుంది. అనంతరం విష్ణుమూర్తి ఉపాయంతో గజాసురుడి నుంచి శివుడు బయటకు వస్తాడు. గజాసురుడు మరణించే ముందు తన శిరస్సు పూజ్యంగా ఉండాలని, తన చర్మాన్ని శివుడు ధరించాలని కోరుకుంటాడు.కైలాసానికి తిరిగి వచ్చిన శివుడిని చూసేందుకు పార్వతీదేవి సిద్ధమవుతుంది. స్నానానికి వెళ్లే ముందు నలుగు పిండితో ఒక బాలుడిని తయారు చేసి, అతనికి ప్రాణం పోసి గుమ్మం వద్ద కాపలాగా ఉంచుతుంది. పార్వతీదేవి ఆజ్ఞ మేరకు ఆ బాలుడు శివుడిని లోపలికి అనుమతించడు. ఆగ్రహించిన శివుడు బాలుడి తలను నరికివేస్తాడు. విషయం తెలుసుకున్న పార్వతీదేవి తీవ్రంగా బాధపడటంతో, శివుడు గజాసురుడి శిరస్సును బాలుడికి అమర్చి తిరిగి ప్రాణం పోస్తాడు. ఆ బాలుడే గజాననుడు, వినాయకుడు.
తరువాత గణపతి, కుమారస్వామి మధ్య విఘ్నాధిపత్యం కోసం పోటీ ఏర్పడుతుంది. మూడు లోకాలలోని పుణ్య తీర్థాలను ముందుగా దర్శించి తిరిగి వచ్చినవారికి ఆ పదవి ఇస్తానని శివుడు చెబుతాడు. కుమారస్వామి నెమలిపై ముల్లోకాలకు బయలుదేరగా, గణపతి మాత్రం తల్లిదండ్రుల చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేస్తాడు. తల్లిదండ్రులే సమస్త లోకాలకు ప్రతీకలని భావించి చేసిన ఈ ప్రదక్షిణకు తీర్థయాత్ర ఫలితం లభిస్తుంది. చివరకు గణపతికే విఘ్నాధిపత్యం లభిస్తుంది.అయితే గణపతి చవితి కథలో చంద్రుడి శాపానికి కూడా ప్రత్యేక స్థానం ఉంది. పూజల అనంతరం గణపతి కుడుములు తదితర నైవేద్యాలతో కైలాసానికి తిరిగి వెళ్తుండగా, చంద్రుడు ఆయనను చూసి నవ్వాడని కథ చెబుతుంది. దాంతో పార్వతీదేవి ఆగ్రహించి, వినాయక చవితి రోజున చంద్రుడిని చూసిన వారికి నీలాపనిందలు వస్తాయని శపిస్తుంది. అనంతరం దేవతల ప్రార్థనతో శాపాన్ని సడలించి, ఆ రోజున మాత్రమే చంద్రుడిని చూడకూడదని చెబుతుంది.
ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడికి కూడా అనుకోకుండా చంద్రుడి ప్రతిబింబం కనిపించినట్లు శమంతకమణి కథలో ఉంది. అనంతరం శమంతకమణి దొంగతనం చేశాడనే నింద శ్రీకృష్ణుడిపై పడుతుంది. ఆ నిందను తొలగించుకునేందుకు శ్రీకృష్ణుడు మణి కోసం అన్వేషించి, జాంబవంతుడితో 28 రోజుల పాటు యుద్ధం చేస్తాడు. చివరకు జాంబవంతుడు శ్రీకృష్ణుడి దైవ స్వరూపాన్ని గుర్తించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా సమర్పిస్తాడు. అనంతరం సత్రాజిత్తు తన తప్పును తెలుసుకుని తన కుమార్తె సత్యభామను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు.
ఈ కథ ఆధారంగా భాద్రపద శుద్ధ చతుర్థి రోజున అనుకోకుండా చంద్రుడిని చూసినవారు గణపతిని పూజించి, శమంతకమణి కథను విని, పూజాక్షతలను తలపై ధరించాలనే సంప్రదాయం ఏర్పడిందని పురాణ కథనం చెబుతుంది.అందుకే వినాయక చవితి కేవలం గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించే పండుగ మాత్రమే కాకుండా.. గణపతి జననం, విఘ్నాధిపత్యం, చంద్రుడి శాపం, శ్రీకృష్ణుడి శమంతకమణి కథ వంటి అనేక పురాణ గాథలను గుర్తుచేసుకునే పవిత్రమైన పర్వదినంగా భక్తులు భావిస్తారు.
సర్వే జనా స్సుఖినోభవంతు.


