ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు వెల్లడించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా పార్టీని మరింత చేరువ చేయడంతో పాటు కార్యకర్తల్లో సేవా భావాన్ని పెంపొందించడమే అభియాన్ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.అభియాన్ ప్రారంభ రోజైన సెప్టెంబర్ 17న ‘ఆశీర్వాద్ కా దియా’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రాంచందర్‌రావు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. మోదీ ప్రజాసేవా ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ నెల రోజుల పాటు వివిధ సామాజిక, సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు రాంచందర్‌రావు తెలిపారు. యువత, విద్యార్థులను భాగస్వాములను చేసేలా వ్యాసరచన పోటీలు వంటి కార్యక్రమాలను కూడా చేపట్టనున్నట్లు చెప్పారు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలతో పార్టీ కార్యకర్తలకు మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పడేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు.
మరోవైపు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు రాంచందర్‌రావు పేర్కొన్నారు. ముఖ్యంగా పేదలు, చేతివృత్తిదారులు, వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలు, ఆర్థిక సహాయంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.మోదీ పాలనలో జన్‌ధన్ యోజన ద్వారా పేదలను బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించడంతో పాటు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా సంక్షేమ ప్రయోజనాలను నేరుగా లబ్ధిదారులకు అందించే విధానం అమల్లోకి వచ్చిందని రాంచందర్‌రావు వివరించారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు ఈ విధానం దోహదపడుతోందని ఆయన అన్నారు.అలాగే యూపీఐ, డిజిటల్ చెల్లింపుల విస్తరణతో భారత్ ప్రపంచ డిజిటల్ పేమెంట్ రంగంలో కీలక స్థానానికి చేరుకుందని రాంచందర్‌రావు పేర్కొన్నారు. పీఎం విశ్వకర్మ, పీఎం స్వనిధి, ముద్ర రుణాల ద్వారా వివిధ వర్గాలకు ఆర్థిక చేయూత అందిస్తున్నట్లు తెలిపారు.చేతివృత్తిదారులు, సంప్రదాయ వృత్తులపై ఆధారపడినవారు, వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులకు అందుబాటులో ఉన్న కేంద్ర పథకాలపై ప్రజలకు వివరించేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు.‘మేరే సప్నో కా భారత్’, ‘సేవా కీ కహానీ’, ‘సేవా జ్యోతి కలశ్ యాత్ర’, ‘సుశాసన్ సేవా సంవాద్’ వంటి పలు కార్యక్రమాలను కూడా నెల రోజుల పాటు నిర్వహించనున్నట్లు రాంచందర్‌రావు వెల్లడించారు. ఈ కార్యక్రమాల ద్వారా మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పాలనలో తీసుకొచ్చిన మార్పులను ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు.


