మెట్రో, ఆర్టీసీకి ఒకే పాస్.. నగర ప్రయాణికులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్

Must read

హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాను మరింత సులభతరం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి ప్రత్యేకంగా టికెట్లు తీసుకునే అవసరం లేకుండా.. ఒకే టికెట్ లేదా పాస్‌తో రెండు రకాల ప్రజా రవాణా సేవలను వినియోగించుకునేలా ‘కామన్ పాస్’ విధానాన్ని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.రసూల్‌పురాలోని మెట్రో రైల్ భవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నగర ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించిన పలు అంశాలపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్రో, ఆర్టీసీ మధ్య సమన్వయంతో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థను అందించడంపై చర్చించారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోజువారీ, నెలవారీ కామన్ పాస్‌లు జారీ చేయాలని ఆయన సూచించారు.ఈ విధానాన్ని అమలు చేసేందుకు తాము సాంకేతికంగా పూర్తిగా సిద్ధంగా ఉన్నామని అధికారులు సీఎస్‌కు వివరించినట్లు తెలుస్తోంది. దీంతో కామన్ పాస్ విధానం త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఒకే పాస్‌తో మెట్రో, ఆర్టీసీ సేవలను ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తే రోజువారీగా నగరంలో ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులకు సమయం, టికెటింగ్ ప్రక్రియలో ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది.

సమావేశం అనంతరం సీఎస్ నగరంలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. బేగంపేట నుంచి ప్యారడైజ్ వరకు మెట్రో రైలులో ప్రయాణించి, ఆయా స్టేషన్లలో ప్రయాణికులకు అందుతున్న వసతులను పరిశీలించారు. స్టేషన్లలో మౌలిక సదుపాయాలు, ప్రయాణికుల సౌకర్యాలు, రవాణా అనుసంధానం వంటి అంశాలను ఆయన పరిశీలించినట్లు సమాచారం.అదే సమయంలో హైదరాబాద్ మెట్రో విస్తరణ పనులపైనా సీఎస్ సమీక్ష నిర్వహించారు. పాతబస్తీలో ప్రతిపాదించిన 7.5 కిలోమీటర్ల మెట్రో కారిడార్ విస్తరణ పనులతో పాటు నేషనల్ హైవే-44పై ప్యారడైజ్ నుంచి డెయిరీ ఫామ్ రోడ్ వరకు నిర్మిస్తున్న 5.40 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ పురోగతిని పరిశీలించారు.ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో ఎదురవుతున్న పలు సమస్యలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ముఖ్యంగా భూసేకరణ, బేగంపేట విమానాశ్రయం వద్ద సొరంగ మార్గానికి సంబంధించిన అనుమతులు, రక్షణ శాఖకు చెందిన భూముల అంశాలు ప్రాజెక్టుల పురోగతిపై ప్రభావం చూపుతున్నట్లు అధికారులు సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నగర మెట్రో, రవాణా మౌలిక వసతుల ప్రాజెక్టులను అన్ని శాఖల మధ్య సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. పెండింగ్ అనుమతులు, భూసేకరణ, ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలను సమన్వయంతో పరిష్కరించి ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!