నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచుపెంటల్లో తాగునీటి సరఫరాపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గురువారం సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీలోని తన చాంబర్‌లో జరిగిన ఈ సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, మిషన్ భగీరథ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. చెంచు గిరిజనులకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
చెంచుపెంటలకు ప్రస్తుతం అందుతున్న తాగునీటి సరఫరా, ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు మంత్రి సీతక్కకు వివరాలు అందజేశారు. నల్లమల అటవీ ప్రాంతంలో కేంద్ర పర్యావరణ నిబంధనల కారణంగా విద్యుత్ అనుమతులు పొందడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు తెలిపారు. దీంతో మిషన్ భగీరథ ద్వారా నీటిని పంపింగ్ చేయడంలో సమస్యలు వస్తున్నట్లు వివరించారు.
అయితే ఈ సమస్యల మధ్య కూడా ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగిస్తూ అన్ని చెంచుపెంటలకు తాగునీటి సరఫరా కొనసాగుతోందని అధికారులు మంత్రికి వివరించారు. నీటి సరఫరాలో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
చెంచుపెంటల్లో తాగునీటి కొరతకు ఎలాంటి అవకాశం లేకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ముఖ్యంగా నల్లమల అటవీ ప్రాంతంలోని మారుమూల చెంచు ఆవాసాల్లో నీటి లభ్యతను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. కేవలం కార్యాలయ స్థాయి నివేదికలకే పరిమితం కాకుండా అధికారులు స్వయంగా చెంచుపెంటల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను తెలుసుకోవాలని స్పష్టం చేశారు.
ప్రతి చెంచుపెంటలో పర్యటించి తాగునీటి సరఫరా ఎలా ఉంది, ప్రజలకు ఎంత మేరకు నీరు అందుతోంది, ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, భవిష్యత్తులో ఎలాంటి ఏర్పాట్లు అవసరం అనే అంశాలపై సమగ్రంగా పరిశీలించాలని మంత్రి సూచించారు. అనంతరం ప్రతి చెంచుపెంటకు సంబంధించిన వివరాలతో కూడిన సమగ్ర నివేదికను తనకు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
నల్లమల అటవీ ప్రాంతంలో భౌగోళిక పరిస్థితులు, అటవీ మరియు పర్యావరణ నిబంధనలు కారణంగా మౌలిక వసతుల కల్పనలో ప్రత్యేక సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో తాగునీటి సమస్యను ప్రాధాన్యతతో పరిష్కరించాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. చెంచు గిరిజన ప్రాంతాల్లో ప్రజల ప్రాథమిక అవసరాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, తాగునీటి విషయంలో నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని ఆమె స్పష్టం చేశారు.
ఈ సమీక్షలో మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ జి. లలిత, సూపరింటెండెంట్ ఇంజనీర్ హెచ్. జగన్మోహన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. విజయసీ, అసిస్టెంట్ ఇంజనీర్లు ఈ. సందీప్, ఎస్‌కే. అక్బర్ పాషా తదితరులు పాల్గొన్నారు.


