Tuesday, September 8, 2026

కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్

Must read

తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. అసెంబ్లీ వద్ద సోమవారం జరిగిన ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కేసీఆర్ ఫామ్‌హౌస్‌ వైపు బయలుదేరడం, వారిని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేసి వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు.కేటీఆర్‌తో పాటు కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బోయినపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. హరీశ్‌రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలను జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అసెంబ్లీ వద్ద చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ఫామ్‌హౌస్‌ వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఇదిలా ఉండగా, సోమవారం అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ ఫామ్‌హౌస్‌ వైపు బయలుదేరారు. దామరకుంట సమీపంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు ఎదురుపడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్‌ను బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారని, ఈ క్రమంలో రాళ్ల దాడికి ప్రయత్నం జరిగిందని కాంగ్రెస్ వర్గాలు ఆరోపించాయి. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత పెరిగింది.ఈ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ వద్ద ఉన్న కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ఫామ్‌హౌస్‌ వైపు బయలుదేరారు. అయితే హకీంపేట వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసుల ఆంక్షలను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు.అక్కడి నుంచి ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కాలినడకన ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. బొల్లారం వద్ద పోలీసులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఎర్రవల్లి వైపు వెళ్తున్న తమను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులను ప్రశ్నించారు. పోలీసుల చర్యలపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

బొల్లారం చౌరస్తా నుంచి ఎర్రవల్లి వైపు కాలినడకన వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్లకు తరలించారు. కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు ఎమ్మెల్యేల అరెస్టుతో తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తత మరింత పెరిగింది.ఒకవైపు అసెంబ్లీ ఘటనపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర విమర్శలు కొనసాగుతుండగా.. మరోవైపు నేతల అరెస్టులు, కాంగ్రెస్–బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణలతో పరిస్థితి మరింత హీట్ ఎక్కింది. తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!