తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పించడంతో రాష్ట్ర రాజకీయాల్లో కేబినెట్ విస్తరణపై చర్చ మరింత వేడెక్కింది. ఇప్పటికే మంత్రివర్గంలో రెండు స్థానాలు ఖాళీగా ఉండగా, సురేఖను తొలగించడంతో మొత్తం ఖాళీల సంఖ్య మూడుకు చేరింది. దీంతో ఈ మూడు మంత్రి పదవులను ఎప్పుడు భర్తీ చేస్తారు? ఎవరికి అవకాశం దక్కుతుంది? అనే అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణపై దృష్టి సారించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో పార్టీ అధిష్ఠానంతో ఇప్పటికే చర్చలు జరిగినట్లు ఆ వర్గాలు చెబుతున్నప్పటికీ.. అధికారికంగా ముహూర్తం ఎప్పుడు అనేది మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపైనే కేబినెట్ విస్తరణ ఆధారపడి ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
మూడు ఖాళీల భర్తీలో సామాజిక సమీకరణాలు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించిన నేపథ్యంలో బీసీ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం కాంగ్రెస్‌లో వినిపిస్తోంది. ఈ కోటాలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేరు ముందువరుసలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఇక రెడ్డి సామాజికవర్గం నుంచి ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందనే ఊహాగానాలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరు ఈ కోణంలో వినిపిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రస్తుతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం ఆయనకు అనుకూలంగా మారే అవకాశం ఉందనే చర్చ ఉంది.
మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఆయన ఇటీవల పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశైలిపై చేసిన వ్యాఖ్యలను అధిష్ఠానం ఎలా పరిగణనలోకి తీసుకుంటుందనేది కీలకంగా మారింది. మంత్రి పదవి ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఇదే విధమైన వైఖరిని కొనసాగిస్తే రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఉంటాయనే అంశంపై కూడా కాంగ్రెస్‌లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
మరో మంత్రి పదవిని ఎస్టీ సామాజికవర్గానికి, ముఖ్యంగా లంబాడా వర్గానికి కేటాయించాలనే ఆలోచన ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ కోణంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పేరు వినిపిస్తోంది. అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఇప్పటికే ఇద్దరు రెడ్డి మంత్రులు ఉన్న నేపథ్యంలో అదే జిల్లాకు చెందిన మరో నేతకు మంత్రి పదవి ఇస్తారా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.
ఇదే సమయంలో లంబాడా కోటాలో రామచంద్రు నాయక్ పేరు కూడా చర్చకు వస్తోంది. గతంలో డిప్యూటీ స్పీకర్ పదవికి సంబంధించిన పరిణామాలు, ఆయన అభ్యర్థిత్వంపై పార్టీ అధిష్ఠానం వైఖరి వంటి అంశాలు కూడా నిర్ణయంలో ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరోవైపు బాలు నాయక్‌కు మంత్రి పదవికి బదులుగా డిప్యూటీ స్పీకర్ బాధ్యతలు అప్పగించే అవకాశంపై కూడా చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
మొత్తంగా బీసీ, రెడ్డి, ఎస్టీ సామాజిక సమీకరణాలతో పాటు ప్రాంతీయ ప్రాతినిధ్యం, పార్టీ విధేయత, రాజకీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న చర్చలన్నీ పార్టీ వర్గాల్లోని ఊహాగానాలే. కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి లేదా కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనే అంశంపై స్పష్టత రానుంది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో కేబినెట్ విస్తరణ వ్యవహారం ఆసక్తిని రేపుతోంది.




