Saturday, September 5, 2026

నిర్మాతల మండలి ఎన్నికల్లో హీట్.. గిల్డ్‌పై సి.కళ్యాణ్ సంచలన ఆరోపణలు

Must read

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల వేడి తారస్థాయికి చేరుకుంది. ఎన్నికల నేపథ్యంలో ‘మన ప్యానెల్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ప్రత్యర్థి వర్గమైన గిల్డ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. నిర్మాతల మండలి నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇవి సి.కళ్యాణ్ చేసిన ఆరోపణలు మాత్రమే కాగా.. దీనిపై గిల్డ్ వర్గాల స్పందన తెలియాల్సి ఉంది.కౌన్సిల్‌కు రావాల్సిన సొమ్మును గిల్డ్‌కు తరలించి కొందరు అనుభవిస్తున్నారని సి.కళ్యాణ్ ఆరోపించారు. పేద నిర్మాతలకు అందాల్సిన డబ్బును గిల్డ్ సభ్యులు తమలో తామే పంచుకున్నారని, దీని వల్ల చిన్న సినిమాలు, చిన్న నిర్మాతలకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. గిల్డ్ కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు.

తమ ప్యానెల్‌పై కూడా ఎవరైనా ఆరోపణలు చేస్తే నిరూపించాలని సి.కళ్యాణ్ సవాల్ విసిరారు. తమ ప్యానెల్ నిధులను దుర్వినియోగం చేసిందని ఎవరైనా నిరూపిస్తే తాను వెంటనే ఎన్నికల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. తమపై చిన్న మచ్చ చూపించినా నామినేషన్ ఉపసంహరించుకుంటానని అన్నారు. సంస్థను కొందరు పూర్తిగా తమ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని, వారి మధ్య ఐక్యత కూడా లేదని విమర్శించారు.గత రెండున్నరేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ నిర్మాతలకు ఎలాంటి సహాయం చేయని వారు.. ఎన్నికల సమయం దగ్గరపడగానే హామీలు, వాగ్దానాలు చేస్తున్నారని సి.కళ్యాణ్ విమర్శించారు. ఎన్నికల సమయంలో మాత్రమే నిర్మాతల సమస్యలు గుర్తుకు రావడం సరికాదని అన్నారు. అధికారంలో ఉన్న సమయంలో చిన్న నిర్మాతల సమస్యలను పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రత్యర్థి వర్గాన్ని ప్రశ్నించారు.

తమ ‘మన ప్యానెల్’లో ఏడుగురు సభ్యులు మాత్రమే ఉన్నారని, ప్రత్యర్థి ప్యానెల్‌లో 16 మంది ఉన్నారని సి.కళ్యాణ్ తెలిపారు. సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ నిర్మాతల కోసం వారు సాధించిన ఫలితాలు ఏమిటని ప్రశ్నించారు. నిర్మాతల మండలి ప్రధానంగా చిన్న నిర్మాతలకు అండగా నిలవాల్సిన సంస్థ అని ఆయన పేర్కొన్నారు.తెలుగు సినీ పరిశ్రమలో ఏడాదికి సుమారు 300 చిన్న సినిమాలు వస్తున్నాయని సి.కళ్యాణ్ అన్నారు. ఈ చిన్న సినిమాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 40 వేల మంది ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. చిన్న నిర్మాతలు, చిన్న సినిమాలను ఆదుకోవడమే తమ ప్యానెల్ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

నిర్మాతల మండలి ఒక ఛారిటీ సంస్థ తరహాలో నిర్మాతలకు అండగా ఉండాల్సిన వ్యవస్థ అని సి.కళ్యాణ్ పేర్కొన్నారు. సంస్థకు గతంలో జరిగిన పరిణామాలు, అన్యాయాల గురించి పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. నిర్మాతల సంక్షేమం కోసం గతంలో తమ ప్యానెల్ చేసిన కార్యక్రమాలను కూడా ఆయన గుర్తు చేశారు.ఒక నిర్మాత సినిమా నిర్మించిన తర్వాత మెడిక్లెయిమ్ ప్రయోజనం పొందే విధానాన్ని తీసుకురావడంలో తమ వర్గం కీలక పాత్ర పోషించిందని సి.కళ్యాణ్ తెలిపారు. నిర్మాతల సంక్షేమానికి సంబంధించిన అంశాల్లో తమ ప్యానెల్ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు.

ఎన్నికల తర్వాత తాను ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టినా అందరినీ కలుపుకుని పనిచేస్తానని సి.కళ్యాణ్ హామీ ఇచ్చారు. వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి నిర్మాతల సంక్షేమం కోసం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న నిర్మాతల సమస్యలు, సంక్షేమం, పరిశ్రమలోని వివిధ అంశాలపై దృష్టి సారిస్తామని తెలిపారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!