తన అద్భుతమైన దర్శకత్వ ప్రతిభతో అన్ని రకాల ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు దర్శకుడు ఎస్ వీ కృష్ణా రెడ్డి. ఆయన చిత్రీకరించిన ప్రతీ చిత్రం ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు, ఈయన చిత్రాలు ఫ్యామిలీ సెంటిమెంట్స్ తో పాటు వినోదం కలగలిపి ఉంటాయి. 

అటువంటి ఎస్ వి కృష్ణా రెడ్డి దాదాపు దశాబ్దం తరువాత తెరకెక్కించిన చిత్రం "ఆర్గానిక్ మామ - హైబ్రీడ్ అల్లుడు". మర్చి 3,శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ పొందుతోంది. నటకిరీటి రాజేంద్రప్రసాద్, "బిగ్ బాస్" సోహెల్ ప్రధాన పాత్రలలో నటించారు. మృణాళినిరవి ఈ చిత్రంలో కథానాయికగా నటించగా ప్రముఖ నటి మీనా ప్రధాన పాత్రలో నటించారు. కోనేరు కల్పన నిర్మించిన ఈ సినిమాకు అచ్చిరెడ్డి ప్రెజెంటర్ గా వ్యవహరించారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను అలరించిందో చూద్దాం. 

రెండు సినిమాలు తీసినా కూడా సరైన ఫలితం దక్కని దర్శకుడు విజయ్(సోహెల్) తనెలాగైనా హిట్ సినిమా తీయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. తన తల్లి తండ్రులు కొయ్యబొమ్మలు చేస్తూ జీవనం సాగిస్తుండడంతో ఒక స్టార్ హోటల్ తో ఒప్పొందం కుదుర్చుకొని ఆ బొమ్మలను హీరో అమ్ముతూ ఉంటాడు. ఆర్గానిక్ వ్యవసాయ చేస్తూ స్టార్ హోటల్స్ కు కూరగాయలు సప్లై చేస్తుంటాడు వెంకట రమణ(రాజేంద్ర ప్రసాద్). ఈ నేపథ్యంలో హీరో హీరోయిన్స్ మధ్యన పరిచయం ఎలా ఏర్పడుతుంది,వారి ప్రేమ ఫలిస్తుందా, దర్శకుడు విజయ్ తాను అనుకున్న విధంగా హిట్ సినిమా తీస్తాడా అనేది సినిమా కధ. 

ఈ సినిమాలో కృష్ణా రెడ్డి ఒక దర్శకుడు ఫ్లాప్స్ లో ఉంటే మీడియా ఏ విధంగా టార్గెట్ చేస్తుంది, కొన్ని ఫ్లాప్స్ వచ్చినంత మాత్రాన ఆ డైరెక్టర్ లో విషయం లేదనుకోడం ఎంత తప్పో చూపించారు. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ ఈ పాత్రలో జీవించారని చెప్పవచ్చు. వరుణ్ సందేశ్, రష్మీ గౌతమ్ ఈ సినిమాకు ప్రత్యేక అట్రాక్షన్, వారు తమ పాత్రలకు న్యాయం చేశారు. మరోవైపు కామెడీ సీన్స్ కూడా బాగానే అలరించాయి. 

ఇంతకు ముందు సినిమాలలో లాగే ఈ చిత్రానికి కృష్ణా రెడ్డి సంగీతం అందించారు. అయితే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి డివైడ్ టాక్ వినిపిస్తుంది. ఏదేమైనా కృష్ణారెడ్డి సినిమాలలో ఎప్పుడూ వినోదానాకి కొదవ ఉండదు. దశాబ్దం గ్యాప్ తీసుకొని మళ్ళీ తెలుగు సినీ ప్రేక్షకులముందుకు వచ్చిన కృష్ణారెడ్డి మరెన్నో సినిమాలు తీసి ప్రేక్షకులకు ఆనందాన్ని పంచాలి అని కోరుకుందాం.