నేడు కేబినెట్ భేటీ..గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాత్రి కర్ఫ్యూపై యోచన
కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలపై నేడు కేబినెట్ భేటీ
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాత్రి కర్ఫ్యూపై యోచన
పూర్తిస్థాయి లాక్ డౌన్ పెట్టే అవకాశం లేదన్న అధికారవర్గాలు
ర్యాలీలు, జనం గుమిగూడే కార్యక్రమాలపై నిషేధం పొడిగింపు
ప్రజల ఇబ్బందుల దృష్ట్యా ఆచితూచి నిర్ణయాలు తీసుకునే అవకాశం
యాసంగి సాగు, ధాన్యం కొనుగోళ్లు, ధరణి తదితర అంశాలపైనా చర్చ
కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కేసుల ఉధృతి పెరిగి, మూడో వేవ్ మొదలైన నేపథ్యంలో రాష్ట్రంలో ఆంక్షల విధింపునకు రంగం సిద్ధమైంది.
కరోనా పరిస్థితులు, ముందు జాగ్రత్త చర్యలపై మంత్రివర్గం సోమవారం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీకానుంది. ఇందులో కరోనా అంశాలతోపాటు వ్యవసాయం, పంటల కొనుగోళ్లు తదితర అంశాలపై చర్చించనున్నారు.
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, నియంత్రణ చర్యలకు సంబంధించి వైద్యారోగ్య శాఖ అధికారులతో కేబినెట్ సమీక్షించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా వైద్యసేవల ఏర్పాట్లను పరిశీలించి, అవసరమైన ఆదేశాలు జారీ చేయనుంది. ఇదే సమయంలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి ఏం చేస్తే బాగుంటుందన్న దానిపై సమీక్షించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇక కరోనా కట్టడికోసం ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను పరిశీలించనుంది. ప్రస్తుతం ఢిల్లీలో కేసుల ఉధృతి పెరుగుతుండడంతో.. వారాంతపు కర్ఫ్యూతోపాటు రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తున్నారు.
అక్కడ రెస్టారెంట్లు, బార్లను మూసివేసి.. కేవలం పార్శిల్ సేవలకే అనుమతి ఇచ్చారు. యూపీ, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించలేదు. అయితే ఇతర పెద్ద రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగా ఉంటుండటం ఊరటనిచ్చే అంశమని, ఇక్కడ ఎలాంటి లాక్‌డౌన్ విధించే పరిస్థితులు లేవని అధికారవర్గాలు చెప్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో.. నగరంలో రాత్రి కర్ఫ్యూ విధించే అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నాయి. ఇతర జిల్లాల్లో
రాత్రి కర్ఫ్యూ విధించే అవకాశాలు లేవని, గతంలో రాత్రి కర్ఫ్యూ పెట్టినప్పుడు పెద్దగా ప్రయోజనం కలగలేదని గుర్తు చేస్తున్నాయి. ఒమిక్రాన్‌తో కేసులు పెరుగుతున్నా.. ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు తక్కువగా ఉండటంతో కొత్త ఆంక్షల విధింపుపై ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకోనుందని స్పష్టం చేస్తున్నాయి. అన్నిరకాల ర్యాలీలు, జన సామూహిక కార్యక్రమాలపై విధించిన నిషేధాన్ని ఈ నెలాఖరు వరకు పొడించే అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాలు తెలిపాయి.
Share this article in your network!