లోక్ సభ ఎన్నికలలో పోటీపై కేటీఆర్ క్లారిటీ
రానున్న లోక్ సభ ఎన్నికల్లో సీనియర్లెవరం పోటీ చేయబోమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అయితే ఏ నియోజకవర్గం నుంచి ఎవరిని బరిలోకి దించాలనే అంశంపై పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే చూసుకుంటారన్నారు. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ కంటే తామే ఎక్కువ స్థానాలు సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు.పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు వచ్చిన కొట్లాడేందుకు సంసిద్ధంగా ఉన్నామన్నారు. ఎరేవంత్ ప్రభుత్వం అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలైంగదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల్లో పార్టీ పక్షాన తీవ్ర పోటీ ఉందని ఆయన చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ కోలుకుంటున్నారని, ప్రస్తుతం స్టిక్ పట్టుకొని ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్పారు.
గురువారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం అద్భుతమైన పాలన అందించినప్పటికీ….. సోషల్ మీడియాలో జరిగిన తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్ట లేకపోయామన్నారు. ప్రజలు దానినే నమ్మి ఓట్లు తమకు వ్యతిరేకంగా వేశారన్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల నుంచి తిరిగి బీఆర్ఎస్ జైత్రయాత్రను ప్రారంభించేందుకు త్వరలో తెలంగాణ బలగం పేరుతో 30వేల మందితో సోషల్ మీడియా టీంను ఏర్పాటు చేయబోతున్నట్టు కేటీఆర్ చెప్పారు. ఎన్నికలతో సంబంధం లేకుండా బూత్ స్థాయి నుంచి సమస్యలు, ఇబ్బందులు అన్నీ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో అతి స్వల్ప ఓట్ల తేడాతో 14 ఎమ్మెల్యే స్థానాల్లో ఓడిపోయామని తెలిపారు. ప్రధానంగా పార్టీ నిర్మాణంపై ప్రధానంగా దృష్టి సారిస్తామన్నారు. అంతర్జాతీయ వేదికలపైనే సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇస్తున్నామని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. రైతుబంధు అని చెప్పడంలో ఇబ్బందేమిటని ప్రశ్నించారు. ఫ్రీ బస్సు కారణంగా తొమ్మిది మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఫిబ్రవరి 1తో సర్పంచుల పదవీకాలం ముగుస్తుందని చెప్పిన కేటీఆర్… వారి టెన్యూర్ ను పొడిగించాలని లేదా వెంటనే ఎన్నికలు నిర్వహించాలని అన్నారు.
ఢిల్లీ నుంచే రాష్ట్ర పాలన
రేవంత్ రెడ్డి 45 రోజుల్లో సాధించింది కేవలం ఢిల్లీ పర్యటనలు చేయడం మాత్రమేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర పరిపాలన ఢిల్లీ నుంచి జరుగుతుందని ముందే చెప్పామని…..ప్రస్తుతం అదే జరుగుతుందన్నారు.
రైతు భరోసా ప్రారంభించామని పచ్చి అబద్ధాలు చెప్పినందుకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి దావోస్ వెళ్లి ప్రపంచ వేదిక పైన పచ్చి అబద్దాలు చెప్పారన్నారు. అసలు ప్రారంభమే కానీ రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు డబ్బులు ఇస్తున్నట్లు చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. అంతర్జాతీయ వేదికల పైన రేవంత్ రైతు భరోసా పేరుతో అబద్ధాలు చెపుతుంటే… ఇక్కడ రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతామని మంత్రులు అంటున్నారని వ్యాఖ్యానించారు.ఉన్న రైతుబంధు ఇవ్వని రేవంత్ రెడ్డి… లేని రైతు భరోసా గురించి మాట్లాడడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని అన్నారు
రాష్ట్రం దివాలా తీసిందని చెబుతూనే… ముఖ్యమంత్రికి కొత్త క్యాంపు కార్యాలయం ఎందుకు కడుతున్నారని ప్రశ్నించారు.
ఉన్న క్యాంపు కార్యాలయాన్ని పక్కనపెట్టి కొత్త క్యాంపు కార్యాలయం ఎందుకో ప్రజలకు చెప్పాలన్నారు. కేవలం భేషజాల వల్లనే రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ వాడలేదన్నారు.
ముఖ్యమంత్రి మారినప్పుడల్లా కొత్తవి కట్టుకుంటాపోతే ఎలా అని నిలదీశారు. అవసరం లేని భవనాలు కట్టడానికి రేవంత్ రెడ్డికి డబ్బులు వస్తున్నాయి కానీ రైతుబంధుకు నిధులు వేయడానికి రావట్లేదని విమర్శించారు.
ఒకప్పుడు ప్రభుత్వ సలహాదారులు వద్దు అంటూ… గతంలో కోర్టులో కేసు వేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రాజకీయ నిరుద్యోగులను సలహాదారులుగా నియమించుకుంటున్నారన్నారు.
ప్రభుత్వాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని విమర్శించారు.
కోడ్ రాకముందే….జీవోలు ఇవ్వండి
పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఉన్న 13 హామీల అమలుపైన వెంటనే జీవోలు జారీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఇష్టం లేకనే కాంగ్రెస్ ప్రభుత్వం అటెన్షన్ డైవర్షన్ పనులకు పాల్పడుతుందని ఆరోపించారు. ప్రభుత్వం మాట తప్పితే….తాము చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేసేలా ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తామన్నారు. అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి డిప్యూటీ ముఖ్యమంత్రి మట్టి విక్రమార్క అసెంబ్లీ లో తప్పుడు మాట చెప్పారన్నారు. రాష్ట్రాన్ని బెల్టు షాపులు ఎత్తేస్తామని చెప్పినా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎలైట్ బార్లు పెడతామంటుందని విమర్శించారు. కాలేశ్వరంతో ఒక్క ఎకరానికి నీళ్లు రాలేదంటూనే… మంత్రి కొండ సురేఖ నిన్న లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చినామని చెబుతుందన్నారు.
పంటకు రూ. 500 బోనస్ మద్దతు ధర ఇస్తారా? ఇవ్వరా? అన్న విషయంపై ఇప్పటి వరకు రేవంత్ సర్కార్ స్పష్టత ఇవ్వలేదని మండిపడ్డారు.
రాష్ట్రంలో కోటి 57 లక్షల మంది రూ. 2500 ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారన్నారు.
అన్ని అడ్డగోలు నిర్ణయాలే
రేవంత్ ప్రభుత్వం అన్ని అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నదన్నారు. కృష్ణ బేసిన్ లో ఉన్న ప్రజల ప్రయోజనాలను కేంద్రంకు తాకట్టు పెట్టిందన్నారు.
కొత్తగా వచ్చినామని చెప్తున్న ప్రభుత్వం…. మరి అర్ధం లేని ఎందుకు నిర్ణయాలు తీసుకుంటుందో చెప్పాలని ప్రశ్నించారు. ఫార్మసిటీ, ఎయిర్ పోర్టు మెట్రో రద్దు పైన ఏం జరిగిందో ప్రజలకు చెప్పాలన్నారు. వాటిపై, కనీసం కేబినెట్ సమావేశంలో కూడా చర్చించినట్టు లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఇంతటికీ కీలకమైన అంశం పైన ఏం జరిగిందో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తునక లేక్క కాంగ్రెస్ కు అప్పగించామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని కేసీఆర్ చెప్పారన్నారు. కానీ అడ్డగోలుగా తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా… కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పైన మాట్లాడక తప్పడం లేదన్నారు.
రెండు జాతీయ పార్టీలు కేసీఆర్ పై కుట్ర పనేందుకు జతకట్టాయని విమర్శించారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లోను ఈ రెండు పార్టీలు కుమ్మక్కై ఎన్నికలకు పోనున్నాయని జోస్యం చెప్పారు.
కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ఫైర్
రైతుబంధు సాయం అందడం లేదన్న వారిని చెప్పుతో కొట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. రైతుబంధు సొమ్మును తమ ఖాతాల్లో జమ చేయడంలో విఫలమైన కాంగ్రెస్ నాయకులకే చెప్పుల ట్రీట్ మెంట్ కావాలని అన్నారు. రైతులకు అవసరం లేదన్నారు. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు సొమ్ము జమ చేయడం కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. కాంగ్రెస్
అధికారంలోకి వచ్చాక రూ.2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేస్తానని ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. అలాగే రైతులకు క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ఆ రెండు హామీలను ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదని తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.4 వేల నిరుద్యోగ భృతి హామీల పరిస్థితి కూడా అలాగే ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ బీజేపీ బీ టీమ్ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని కేటీఆర్ అలా అయితే బీజేపీ నాయకులైన ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, సోయం బాపురావ్ లను తమ పార్టీ ఎందుకు ఓడించిందని ప్రశ్నించారు.
2019 లోక్ సభ ఎన్నికలతో పాటు హుజూరాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ తన ఓట్లను బీజేపీ అభ్యర్థులకు మళ్లించిందని ఆరోపించారు. అలాగే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోడీ, వ్యాపారవేత్త గౌతమ్ అదానీ మధ్య రహస్య ఒప్పందం గురించి ఆరోపణలు చేస్తుండగానే.. మరో వైపు ఆ పార్టీకే చెందిన రేవంత్ రెడ్డి దావోస్ లో అదానీతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఎప్పుడూ కూడా తన వ్యాపార ఆఫర్లతో అదానీని రాష్ట్రంలోకి అనుమతించలేదని, కానీ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇక్కడి అన్ని ప్రభుత్వ సంస్థలను అదానీకి అప్పగించేందుకు కుట్ర పన్నుతున్నారని కేఆర్ ఆరోపించారు.
Share this article in your network!