తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరుస ఢిల్లీ పర్యటనల అంతర్యం ఏంటి..? జాతీయ పార్టీ ఏర్పాటు కోసమే ఆయన వరుసగా హస్తిన చుట్టేసి వస్తున్నారా..? రైతు నేతగా ప్రొజెక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తోన్న కేసీఆర్… జాతీయ పార్టీ పెట్టడంలో భాగంగానే గ్రౌండ్ వర్క్ ను ప్రిపేర్ చేసుకుంటున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. 

బంగారు భారత్ అని నినాదం ఇచ్చిన కేసీఆర్ అవసరమైతే జాతీయ పార్టీ పెడుతానని ఎప్పుడో ప్రకటించారు. ఇప్పుడు అందుకు కావాల్సిన సమయం వచ్చిందని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే జాతీయ స్థాయిలో రైతు నేతగా ముద్ర వేసుకునేందుకుగాను వ్యూహం రచిస్తున్నారు కేసీఆర్. బీజేపీని డీకొట్టాలంటే బలమైన కూటమి అవసరమని భావించిన కేసీఆర్.. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేశారు. కాని థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు జరగని పనిగా భావిస్తోన్న కేసీఆర్.. బీజేపీ వ్యతిరేక పక్షాలు కాంగ్రెస్ గొడుగు కిందకు వెళ్తున్నాయి. తాజాగా బీజేపీకి వ్యతిరేకంగా మత వ్యతిరేక లేఖ రాసిన పార్టీల్లో కాంగ్రెస్ సహా పదమూడు మిత్రపక్షాలున్నాయి. అవన్నీ కాంగ్రెస్ పార్టీతోనే ఉండటం ఖాయం.  

లేఖ మీద సంతకం చేయికపోయినా ఎన్సీపీ, శివసేన వంటి పార్టీలు కాంగ్రెస్‌తోనే ఉంటాయి. అంటే కేసీఆర్ చెప్పే మూడో కూటమి… ప్రాంతీయ పార్టీల కూటమి సాధ్యం కాదని అర్థం అవుతోంది. ఇక , మిగిలిన పార్టీలైన ఎస్పీ, తృణమూల్ పార్టీలతో కలిసి కూటమి సాధ్యం కాదు. ఇవన్నీ ఆలోచించి కేసీఆర్.. జాతీయ కొత్త పార్టీ పెట్టే దిశగా కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో బాగంగానే కేసీఆర్ ఇటీవల తరుచుగా ఢిల్లీని చుట్టేసి వస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.