బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యవహారంపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధుపై చర్యలు తీసుకునే అధికారం తనకు ఉన్నప్పటికీ.. తాను ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్నానని తెలిపారు. తాతా మధును సభ నుంచి సస్పెండ్ చేయడం పెద్ద విషయం కాదని, క్షణాల్లో ఆ పని చేయగలిగే అధికారం తనకు ఉందని స్పష్టం చేశారు. అయితే శాసనసభ నిబంధనలకు అనుగుణంగానే ముందుకు వెళ్తున్నానని చెప్పారు.మంగళవారం అసెంబ్లీలోని తన చాంబర్లో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. సభ్యుడిగా లేకపోయినా తాతా మధుపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం తనకు ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించినట్టుగా తక్షణమే బహిష్కరించకుండా.. నిబంధనల ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరిస్తున్నామని చెప్పారు.మహిళా శాసనసభ్యుల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించినట్లు విచారణలో తేలితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పీకర్ తెలిపారు. ఈ అంశంపై ఉన్నతాధికారులతో తాను, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడామని, విచారణకు ఆదేశించామని చెప్పారు.
మహిళా సభ్యుల అంశంపై విచారణ
మహిళా సభ్యుల విషయంలో జరిగిన ఘటనకు సంబంధించి వీడియోలను పరిశీలిస్తున్నామని స్పీకర్ తెలిపారు. బీఆర్ఎస్ సభ్యుల ప్రవర్తన వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. మహిళా పోలీసులపై కూడా దాడి చేసినట్టుగా వీడియోల్లో కనిపిస్తోందని మీడియాకు చూపిస్తూ స్పీకర్ పేర్కొన్నారు.మహిళా ఎమ్మెల్యేల పట్ల తనకు ప్రత్యేక గౌరవం ఉందని గడ్డం ప్రసాద్ చెప్పారు. తనకు ఉన్న ఎనిమిది మంది అక్కాచెల్లెళ్లతో పాటు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి కూడా తన సోదరీమణులేనని పేర్కొన్నారు. మహిళా సభ్యులపై పోలీసుల అనుచిత ప్రవర్తనకు సంబంధించిన విచారణ నివేదిక వచ్చిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ప్రస్తుత పరిణామాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూపొందించిన నిబంధనలనే అమలు చేస్తున్నామని స్పీకర్ చెప్పారు. శాసనసభలో సభ్యుల ప్రవర్తన, సభా నిబంధనలను పాటించే విషయంలో తాను ఎలాంటి పక్షపాతం చూపడం లేదని తెలిపారు.
‘ఇలా ఉంటే సభను నడపలేను’
అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై స్పీకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను సభను నడపలేనని చెప్పిన నేపథ్యంలో ప్యానెల్ స్పీకర్ కడియం శ్రీహరికి బాధ్యతలు అప్పగించినట్లు వివరించారు.గతంలో కొందరు స్పీకర్లు కేవలం అధికార పక్షం వైపు మాత్రమే చూసేవారని.. తాను మాత్రం నాలుగు వైపులా చూస్తూ అన్ని పార్టీల సభ్యులకు అవకాశాలు కల్పిస్తున్నానని గడ్డం ప్రసాద్ అన్నారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలను ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు.జిల్లా రాజకీయాల్లో గతంలో తనకు, సబితా ఇంద్రారెడ్డికి మధ్య రాజకీయ పోటీ ఉన్నప్పటికీ.. ఎప్పుడూ ఈ స్థాయిలో వ్యక్తిగతంగా మాట్లాడుకోలేదని స్పీకర్ గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ తాము సంయమనం పాటిస్తున్నామని తెలిపారు.తాతా మధు తన పరిధిలోనే అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారని స్పీకర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒక్కరోజులోనే సస్పెండ్ చేసిన సందర్భాలను గుర్తు చేస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అలాంటి తొందరపాటు చర్యలకు వెళ్లడం లేదని చెప్పారు.
మరోవైపు తాతా మధు వ్యవహారంలో కేసీఆర్ వచ్చి క్షమాపణ చెప్పాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న విషయాన్ని స్పీకర్ ప్రస్తావించారు. ప్రతి అసెంబ్లీ సమావేశాలకు ముందు కేసీఆర్‌ను ఫోన్ చేసి సభకు రావాలని కోరుతున్నానని తెలిపారు. ఆరోగ్యం సహకరిస్తే సభకు వస్తానని కేసీఆర్ చెప్పారని వెల్లడించారు. గత సమావేశాల్లో కూడా వస్తానని చెప్పి వచ్చి సుమారు గంటసేపు ఉండి వెళ్లిపోయారని స్పీకర్ గుర్తుచేశారు.సభా నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ అన్ని పక్షాలకు న్యాయం చేసే విధంగా సభను నడిపించడమే తన లక్ష్యమని గడ్డం ప్రసాద్ స్పష్టం చేశారు.


