తెలంగాణ శాసనసభలో అసెంబ్లీ వెలుపల చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటనపై మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. సోమవారం జరిగిన పరిణామాలకు సంబంధించిన వాస్తవాలు పూర్తిగా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ముఖ్యంగా మహిళా పోలీసులతో అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని మంత్రి డిమాండ్ చేశారు.అసెంబ్లీలో మాట్లాడిన సీతక్క.. స్పీకర్‌ను దూషించిన అంశంపై బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మాట మార్చుతున్నారని విమర్శించారు. గతంలో చేసిన వ్యాఖ్యలు, ప్రస్తుతం చేస్తున్న వివరణల మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆమె అన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలను బయటకు తీసుకురావాలని, ఇందుకోసం అందుబాటులో ఉన్న వీడియోలు, విజువల్స్‌ను పరిశీలించాలని కోరారు.
మహిళా ఎమ్మెల్యేలను ముందు పెట్టుకుని రాజకీయాలు చేయడం ఎందుకని సీతక్క ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదులపై కూడా సమగ్ర విచారణ జరగాలని ఆమె డిమాండ్ చేశారు. రాజకీయ పోరాటాలు ఏ స్థాయిలో ఉన్నా.. మహిళల విషయంలో గౌరవం, బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు.మహిళా పోలీసులు విధులు నిర్వహిస్తున్న సమయంలో వారితో అనుచితంగా ప్రవర్తించడం ఏమాత్రం సమర్థనీయం కాదని సీతక్క అన్నారు. “పొట్టకూటి కోసమో, ప్యాషన్‌తోనో మహిళలు పోలీసు ఉద్యోగాల్లోకి వస్తారు. అలాంటి వారిపై చేతులు వేసి అవమానపరచడం సరికాదు” అని ఆమె వ్యాఖ్యానించారు.ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళా పోలీసులపై చేతులు వేశారని సీతక్క ఆరోపించారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ తన వద్ద ఉన్నాయని, అవసరమైతే వాటిని శాసనసభకు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మహిళా పోలీసులపై చేతులు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
అసెంబ్లీని దేవాలయంతో పోల్చిన మంత్రి సీతక్క.. అలాంటి పవిత్రమైన ప్రాంగణంలో రబస, గొడవలు ఎందుకని ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై చర్చించాల్సిన శాసనసభ వేదికను రాజకీయ ఘర్షణలకు కేంద్రంగా మార్చడం తగదని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులు తమ ప్రవర్తనలో సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని సూచించారు.ఇదే సందర్భంగా బీఆర్ఎస్‌లో అంతర్గత పరిణామాలపైనా సీతక్క ప్రశ్నలు సంధించారు. కేసీఆర్ కుటుంబానికి చెందిన కవితను పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించాల్సి వచ్చిందో బీఆర్ఎస్ నాయకత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. సొంత ఇంటి ఆడబిడ్డ కవిత విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఒకసారి ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు.




