Saturday, September 5, 2026

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. ఏఐ డేటా సెంటర్‌తో 7 వేల ఉద్యోగాలు

Must read

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు కీలక అడుగు పడింది. టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్ వాల్ట్ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కోసం హైపర్ వాల్ట్, దాని భాగస్వామ్య సంస్థలు దాదాపు రూ.70 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 7 వేల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

250 ఎకరాల్లో భారీ AI క్యాంపస్

హైదరాబాద్‌లో 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఈ అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు. సుమారు 1 గిగావాట్ అంటే 1,000 మెగావాట్ల సామర్థ్యంతో క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రపంచంలోని ప్రముఖ ఏఐ కంపెనీలు, హైపర్‌స్కేలర్లు, గ్లోబల్ ఎంటర్‌ప్రైజ్‌లకు అవసరమైన భారీ కంప్యూటింగ్ మౌలిక వసతులను ఈ క్యాంపస్ అందించనుంది.

అత్యధిక సామర్థ్యంతో కూడిన కంప్యూటింగ్ వ్యవస్థలతో పాటు లిక్విడ్ కూలింగ్ వంటి ఆధునిక సాంకేతికతలను డేటా సెంటర్‌లో వినియోగించనున్నారు. భారీ స్థాయిలో ఏఐ మోడల్స్, కంప్యూటింగ్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు హైదరాబాద్‌కు కీలక మౌలిక వసతిగా మారే అవకాశం ఉంది.

సీఎం రేవంత్‌తో TCS ప్రతినిధుల భేటీ

ప్రాజెక్టుకు సంబంధించి టీసీఎస్ ప్రతినిధుల బృందం శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సచివాలయంలో సమావేశమైంది. టీసీఎస్ సీఈఓ కే. కృతివాసన్, సీఓఓ ఆర్తి సుబ్రమణియన్, హైపర్ వాల్ట్ ప్రెసిడెంట్ వి. రాజన్న, సీఈఓ, ఎండీ దీపేష్ నందా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఓపెన్‌ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఉదయ్ రుద్రరాజు అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రాజెక్టు పురోగతి, భవిష్యత్ కార్యాచరణ, అవసరమైన మౌలిక వసతులపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

ఏఐ విప్లవంలో హైదరాబాద్ కీలకం

ఈ ప్రాజెక్టు తెలంగాణకు మాత్రమే కాకుండా దేశానికి కూడా చారిత్రాత్మకమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏఐ విప్లవంలో హైదరాబాద్ ప్రపంచస్థాయిలో అగ్రగామిగా ఎదుగుతోందని అన్నారు. భవిష్యత్తులో ఏఐ మోడల్స్, కంప్యూటింగ్ సామర్థ్యం కీలక ప్రజా మౌలిక వసతులుగా మారనున్నాయని చెప్పారు.

అలాంటి అత్యాధునిక కంప్యూటింగ్ సామర్థ్యం తెలంగాణలో అందుబాటులోకి రావడం రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకరమని సీఎం పేర్కొన్నారు. ఏఐ ఆధారిత పరిశ్రమలు, స్టార్టప్‌లు, గ్లోబల్ కంపెనీలకు హైదరాబాద్ మరింత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

యువతకు ఉద్యోగ అవకాశాలు

ఏఐ కారణంగా అనేక రకాల ఉద్యోగాలు మారుతున్నప్పటికీ బ్లూ కాలర్ ఉద్యోగాలను ఏఐ పూర్తిగా భర్తీ చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. యువతకు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతకు వివిధ రంగాల్లో శిక్షణ అందిస్తున్నామని సీఎం తెలిపారు. కొత్త పరిశ్రమలు, ఆధునిక సాంకేతిక రంగాల్లో ఏర్పడే ఉద్యోగ అవకాశాలను తెలంగాణ యువత సద్వినియోగం చేసుకునేలా నైపుణ్యాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని చెప్పారు.

ఫ్యూచర్ సిటీకి మరింత బలం

రూ.70 వేల కోట్ల భారీ పెట్టుబడితో కేవలం ఏఐ, డేటా సెంటర్ రంగాల్లోనే కాకుండా విద్యుత్, కూలింగ్, నెట్‌వర్కింగ్, నిర్మాణం, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ వంటి అనుబంధ రంగాల్లోనూ కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. గ్రీన్ ఎనర్జీ, వాటర్-న్యూట్రల్ డిజైన్‌కు ప్రాధాన్యత ఇస్తూ పర్యావరణహితంగా క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2026 జనవరిలో దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి, టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ మధ్య జరిగిన సమావేశం కీలకంగా మారింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం, టీసీఎస్ ప్రతినిధుల మధ్య జరిగిన వరుస చర్చలతో ప్రాజెక్టు కార్యరూపం దాల్చింది.

మరో ఐదు రాష్ట్రాల నుంచి పోటీ ఉన్నప్పటికీ తెలంగాణ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును దక్కించుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో హైదరాబాద్‌ను గ్లోబల్ ఏఐ, డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యానికి ఈ ప్రాజెక్టు మరింత ఊతం ఇవ్వనుంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!