హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘ఎపిక్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హీరోయిన్ రష్మిక ముఖ్య అతిథిగా హాజరై తనదైన చలాకీతనంతో సందడి చేశారు. ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ రష్మిక గురించి చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఆమెను ‘వదినమ్మ’ అంటూ ఆనంద్ సంబోధించడం అభిమానులను ఆకట్టుకుంది.
గతంలో ‘బేబీ’ సినిమాలోని ‘ప్రేమిస్తున్నా’ పాట సందర్భంగా రష్మికను చూసిన అభిమానులు ‘వదినా.. వదినా’ అంటూ నినాదాలు చేసిన విషయాన్ని ఆనంద్ దేవరకొండ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఆ విషయాన్ని తాను బయటకు చెప్పలేకపోయానని తెలిపారు. అయితే ఇప్పుడు మాత్రం పూర్తి ప్రైడ్‌తో రష్మికను ‘వదినమ్మ’ అని పిలుస్తున్నానంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నవ్వులు పూశాయి.
తాను సాధారణంగా ఎక్కువగా మాట్లాడే వ్యక్తిని కాదని, ఇంట్లో కూడా పెద్దగా మాట్లాడనని ఆనంద్ చెప్పారు. అయితే రష్మిక మాత్రం తనను ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటారని తెలిపారు. ‘ఎపిక్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా గుంటూరు, రాజమండ్రి, వైజాగ్ తదితర ప్రాంతాల్లోని కాలేజీలకు వెళ్లిన సమయంలో రష్మిక తన ఇంటర్వ్యూలను చూసి మెసేజ్ చేసినట్లు వెల్లడించారు.
తాను బాగా చేస్తున్నానని ప్రోత్సహిస్తూనే.. తన ముఖంలో ఏదో స్ట్రెస్ కనిపిస్తోందని రష్మిక అడిగినట్లు ఆనంద్ తెలిపారు. ఏదైనా మాట్లాడాలనుకుంటున్నావా? అని ఆమె తనను అడిగినట్లు చెప్పారు. ఇలాంటి సపోర్ట్ తనకు ఎప్పుడూ ఉంటుందని ఆనంద్ పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ లాంటి అన్నయ్యతో పాటు ఇంత మంచి వదిన ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆనంద్ చెప్పడం ఈవెంట్లో హైలైట్‌గా మారింది.
ఇక ‘ఎపిక్’ అనే టైటిల్ వెనుక ఉన్న ఆలోచనను కూడా ఆనంద్ వివరించారు. ఎపిక్ అంటే భారీ బడ్జెట్ సినిమా లేదా పెద్ద కథ అని భావించాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనలు, ప్రేమలోని అందమైన క్షణాలే నిజమైన ‘ఎపిక్ మూమెంట్స్’ అని చెప్పారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు పార్ట్నర్ చేయి పట్టుకుంటే వచ్చే ధైర్యం, నుదుటిపై ముద్దు పెడితే కలిగే ఆనందం వంటి చిన్న అనుభూతులు జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతాయని వివరించారు.
‘ఎపిక్’ సినిమాలో ఇలాంటి అందమైన క్షణాలు చాలా ఉంటాయని ఆనంద్ తెలిపారు. సినిమా కేవలం కామెడీ లేదా బ్రీజీ లవ్ స్టోరీగా మాత్రమే ఉండదని.. ప్రేక్షకులను తమ సంబంధాలు, తల్లిదండ్రులతో అనుబంధం, జీవితంలోని బాధ్యతల గురించి ఆలోచింపజేసే ఎమోషనల్ కథగా ఉంటుందని చెప్పారు.
కొత్త కథలు, కొత్త ఆలోచనలు ఇండస్ట్రీలోకి రావాలంటే కొత్త దర్శకులు రావాల్సిన అవసరం ఉందని ఆనంద్ అభిప్రాయపడ్డారు. దర్శకుడు ఆదిత్య హాసన్ ‘ఎపిక్’తో కొత్త పాయింట్ ఆఫ్ వ్యూను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారని ప్రశంసించారు. ఆదిత్య హాసన్ ప్రతి మనిషి జీవితాన్ని నిశితంగా గమనించే వ్యక్తి అని, ఆయనతో మాట్లాడితే థెరపీ సెషన్‌లా అనిపిస్తుందని చెప్పారు.
హీరోయిన్ వైష్ణవి చైతన్యపై కూడా ఆనంద్ ప్రశంసలు కురిపించారు. ‘ఎపిక్’లో ఆమె తన పాత్రను అద్భుతంగా పోషించిందని అన్నారు. పాత్ర కోసం ఆమె చూపించిన ట్రాన్స్ఫర్మేషన్ తనను, దర్శకుడు ఆదిత్య హాసన్‌ను ఆశ్చర్యపరిచిందని తెలిపారు. కళ్లతోనే ఎన్నో భావోద్వేగాలను పలికించగల అద్భుతమైన నటి వైష్ణవి అని కొనియాడారు. భవిష్యత్తులో మంచి కథలను ఎంచుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువ కాలం గుర్తుండిపోయే నటిగా ఆమె ఎదగాలని ఆకాంక్షించారు.
‘ఎపిక్’ చాలా రోజుల తర్వాత వస్తున్న అందమైన లవ్ స్టోరీ అని ఆనంద్ పేర్కొన్నారు. ‘ఏ మాయ చేసావే’, ‘ప్రేమలు’ వంటి ప్రేమకథల్లోని అందమైన అంశాల మేళవింపుగా ఈ సినిమాను అభివర్ణించారు. సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్‌తో కలిసి పనిచేయడం తనకు ప్రత్యేకమైన అనుభవమని తెలిపారు.
చివరగా సెప్టెంబర్ 11న ‘ఎపిక్’ సినిమా థియేటర్లలోకి రానుందని ఆనంద్ వెల్లడించారు. బ్రీజీగా సాగుతూనే ప్రేక్షకులను ఎమోషనల్‌గా కదిలించే రొమాంటిక్ కామెడీగా ఈ సినిమా ఉండబోతుందని తెలిపారు. ప్రేక్షకులంతా థియేటర్లకు వచ్చి సినిమాను ఆదరించాలని ఆయన కోరారు.




