2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని టీమిండియా ఇప్పటి నుంచే సన్నాహాలను ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. మెగా టోర్నీ ప్రధానంగా దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న నేపథ్యంలో.. అక్కడి పరిస్థితులకు భారత ఆటగాళ్లు ముందుగానే అలవాటు పడేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాలోనే భారత్-సౌతాఫ్రికా మధ్య ప్రత్యేక వన్డే సిరీస్ నిర్వహించే అంశంపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం భారత జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా, గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరి నుంచి వచ్చిన ప్రత్యేక విజ్ఞప్తి మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. క్రికెట్ సౌతాఫ్రికాతో చర్చలు ప్రారంభించినట్లు ఓ జాతీయ మీడియా కథనం పేర్కొంది. 2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాలోనే భారత జట్టు పర్యటించి అక్కడ వన్డే సిరీస్ ఆడేలా షెడ్యూల్ రూపొందించాలనే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం.
ఈ సిరీస్‌లో నాలుగు నుంచి ఆరు వన్డేలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 2027 ఐపీఎల్ తర్వాత భారత జట్టు పర్యటనలను బీసీసీఐ ఇంకా పూర్తిగా ఖరారు చేయాల్సి ఉంది. దీంతో ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్‌లో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు అవసరమైన సమయాన్ని కేటాయించే అవకాశం ఉందని సమాచారం.
ప్రపంచకప్ జరిగే దేశంలోనే ముందుగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటం భారత ఆటగాళ్లకు అనేక విధాలుగా ఉపయోగపడనుంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా పిచ్‌ల స్వభావం, అక్కడి వాతావరణ పరిస్థితులు, బౌన్స్, పేస్ వంటి అంశాలపై ఆటగాళ్లకు ముందుగానే అవగాహన వచ్చే అవకాశం ఉంది. మెగా టోర్నీ సమయంలో కొత్త పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవసరం తగ్గుతుందని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై కూడా టీమ్ మేనేజ్మెంట్ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. 2027 ప్రపంచకప్ సమయానికి కీలక ఆటగాళ్లందరూ పూర్తి ఫిట్నెస్తో అందుబాటులో ఉండేలా ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు సమాచారం. భారత జట్టు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ అడ్రియన్ లే రూక్స్ ఇప్పటికే ఆటగాళ్ల కోసం ఫిట్నెస్ ప్రోగ్రామ్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.
ఈ ఫిట్నెస్ ప్రణాళికపై ఆటగాళ్ల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను కూడా బీసీసీఐ నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆహ్వానించినట్లు సమాచారం. ఆటగాళ్ల దృక్కోణాన్ని గిల్ ద్వారా తెలుసుకుని.. టీమ్ మేనేజ్మెంట్, బీసీసీఐ, సపోర్ట్ స్టాఫ్ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూడాలని బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌పై బీసీసీఐ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. వీరిద్దరూ భారత జట్టులో కీలక ఆటగాళ్లు కావడంతో.. ప్రపంచకప్ సమయానికి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా వర్క్‌లోడ్, ఫిట్నెస్ మేనేజ్మెంట్పై ప్రత్యేక ప్రణాళిక రూపొందించే అవకాశం ఉంది.




