Travancore Devaswom Board: కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల శ్రీధర్మశాస్త్ర మండల-మకరవిళక్కు ఉత్సవాల దర్శనానికి సంబంధించి ట్రావెన్కోర్ (Travancore Devaswom Board)దేవస్థానం బోర్డు అత్యంత కీలక ప్రకటన విడుదల చేసింది. అయ్యప్ప స్వామి దర్శనార్ధం వేచి చూస్తున్న లక్షలాది మంది భక్తుల కోసం ఈ నెల 29వ తేదీ ఉదయం 10 గంటల నుంచి వర్చువల్ క్యూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నారు. సన్నిధానానికి చేరుకునే యాత్రికుల రద్దీని క్రమబద్ధీకరించి, సురక్షిత ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో ప్రతిరోజూ నిర్దిష్ట పరిమితిలో మాత్రమే ఆన్లైన్ పాస్‌లను అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
రోజుకు 60 వేల మందికే ఆన్లైన్ దర్శనం.. అందుబాటులోకి స్పాట్ బుకింగ్ కేంద్రాలు:
భక్తులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ దర్శన స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. ప్రధాన మార్గమైన నిలక్కల్-పంబ ద్వారా రోజుకు 60 వేల మందికి, ఎరుమేలి అటవీ మార్గం అలాగే వండిపెరియార్-సత్రం మార్గాల ద్వారా రోజుకు 3 వేల మంది చొప్పున ఆన్లైన్ బుకింగ్ పొందే సదుపాయం కల్పించారు. ముందస్తు బుకింగ్ చేసుకోలేని వారి సౌకర్యార్థం ఎంపిక చేసిన ప్రాంతాల్లో స్పాట్ బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.
వర్చువల్ క్యూ ఉచితం.. స్వచ్ఛంద విరాళాలకు దేవస్థానం బోర్డు విజ్ఞప్తి:
వర్చువల్ క్యూ బుకింగ్ సేవ సంపూర్ణంగా ఉచితమని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తేల్చి చెప్పింది. అయితే క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్యం, భక్తుల వసతుల నిర్వహణ కోసం యాత్రికులు ఇష్టపూర్వకంగా ‘యాత్ర సహాయక నిధి’ లేదా ‘సాధారణ నిధి’కి రూ.5 నుంచి విరాళం అందించవచ్చని కోరింది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులందరూ ఈ నిబంధనలు పాటించాలని బోర్డు సూచించింది.


