Japan Earthquake: జపాన్ దేశంలో మరోసారి భారీ భూకంపం సంభవించి తీవ్ర కలకలం రేపింది. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) వెల్లడించిన కథనం ప్రకారం, జపాన్(Japan Earthquake)లోని బోనిన్ దీవుల సమీప ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ ఘటనలో ఆస్తి లేదా ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. ఇదే సమయంలో దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని వనాటు దీవుల్లోనూ 7.1 తీవ్రతతో మరో భారీ భూకంపం వచ్చినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’.. అసలు జపాన్లో తరచూ భూకంపాలు ఎందుకు వస్తాయి:
జపాన్ భౌగోళికంగా అత్యంత ప్రమాదకరమైన ‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రాంతంలో విస్తరించి ఉండటమే ఇక్కడ తరచూ ప్రకంపనలు రావడానికి ప్రధాన కారణం. పసిఫిక్, ఫిలిప్పీన్ సీ, యూరేషియన్, ఉత్తర అమెరికా టెక్టానిక్ ప్లేట్లు కలుసుకునే ఈ సంక్లిష్ట ప్రాంతంలో నిరంతరం కదలికలు జరుగుతుంటాయి. భూమి పొరల్లోని ఈ ప్లేట్లు ఒకదానికొకటి ఢీకొనడం లేదా కిందకు జారడం వల్ల ఏర్పడే విపరీతమైన ఒత్తిడి ఒక్కసారిగా విడుదలైనప్పుడు తీవ్ర భూకంపాలు సంభవిస్తాయి.


