Subodh Bhave : హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. స్వతంత్రం రాకముందు జరిగిన యుద్ధం, ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కుతున్నట్టు ప్రకటించారు. నిన్న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఫౌజీ గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ లో సుభాష్ చంద్రబోస్ హిట్లర్ తో మాట్లాడుతూ ఫౌజీ అనే సోల్జర్ గురించి గొప్పగా చెప్తాడు. ఈ గ్లింప్స్ వైరల్ గా మారింది. ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
అయితే ఈ గ్లింప్స్ లో ప్రభాస్ కాసేపే కనిపించగా సుభాష్ చంద్రబోస్ పాత్ర ఎక్కువ సేపు కనిపించింది. దీంతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రలో కనిపించి ప్రభాస్ పాత్రకి ఎలివేషన్స్ ఇచ్చిన ఈ నటుడు ఎవరు అని ఆరా తీస్తున్నారు. ఫౌజీ సినిమాలో సుభాష్ చంద్రబోస్ పాత్రలో నటిస్తున్న నటుడు సుబోధ్ భవే. ఇతను మరాఠీ సినీ పరిశ్రమకు చెందిన నటుడు, దర్శకుడు.
Also See : Vaishnavi Chaitanya : చాన్నాళ్లకు మెహందీ పెట్టుకున్నా.. వైష్ణవి చైతన్య సింపుల్ క్యూట్ ఫొటోలు..
సుబోధ్ భవే మరాఠీ సినీ పరిశ్రమలో సీరియల్స్ తో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా నటించారు. దాదాపు 20 కి పైగా సీరియల్స్, 50 కి పైగా మరాఠీ సినిమాల్లో నటించారు. బాలీవుడ్ లో కూడా దాదాపు ఓ పది సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. దర్శకుడిగా కూడా పలు మరాఠీ సినిమాలను తెరకెక్కించారు. నిర్మాతగా కూడా పలు సినిమాల్లో భాగమయ్యారు.
మరాఠీ సినీ పరిశ్రమలో నటుడిగా ఈయనకు చాలా మంచి పేరు ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే స్టేట్ అవార్డుల్లో ఏకంగా 5 సార్లు బెస్ట్ యాక్టర్ అవార్డు సాధించారు. వివిధ సంస్థలకు చెందిన అవార్డుల్లో కూడా బెస్ట్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డులను పలుమార్లు అందుకున్నారు. మరాఠీ పరిశ్రమ వరకే పరిమితమైన సుబోధ్ భవే నేడు ఫౌజీ సినిమాలో సుభాష్ చంద్రబోస్ పాత్రలో కనిపించి ఒక్కసారిగా పాన్ ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకున్నారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత సుబోధ్ భవే పాన్ ఇండియా నటుడిగా మారడం ఖాయం.


