- ఏపీ మున్సిపల్ ఎన్నికలపై కీలక ప్రకటన.. ఈ తేదీలు గుర్తుంచుకోండి
- మైదుకూరు సహా నాలుగు ప్రాంతాల్లో నామినేషన్లకు మరో ఛాన్స్..
- మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు..
- అక్టోబర్ 23, 24 తేదీల్లో మరో అవకాశం
AP Municipal Elections 2026 : ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) రీషెడ్యూల్ చేసింది. ఈ నెల 28న జరగాల్సిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ను నవంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది.
ఓట్ల లెక్కింపు నవంబర్ 3న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులు, నివేదికలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.
నవంబర్ 1న పోలింగ్.. 3న కౌంటింగ్ :
రాష్ట్రంలోని 100 పట్టణ, నగర స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియను రీషెడ్యూల్ చేశారు. నవంబర్ 1న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అవసరమైతే నవంబర్ 2న రీపోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 3న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అభ్యర్థుల తుది జాబితాను అక్టోబర్ 25న మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రకటించనున్నారు.
4 పట్టణ స్థానిక సంస్థల్లో నామినేషన్లకు మరో అవకాశం :
నామినేషన్ల స్వీకరణలో ఆటంకాలు ఎదురైన నేపథ్యంలో కడప నగరపాలక సంస్థ, రాజంపేట, మైదుకూరు, తిరుపతి నగరపాలక సంస్థల్లోని కొన్ని వార్డులకు మరో అవకాశం కల్పించారు. మైదుకూరులోని మొత్తం 32 వార్డులకు కొత్తగా నామినేషన్లు స్వీకరించనున్నారు.
Read Also : AP Local Body Polls : ఏపీలో మున్సిపల్ ఎన్నికలపై ఉత్కంఠ.. ఈసీ ఏం చేయబోతోంది? సుప్రీంకోర్టు గడువుతో టెన్షన్..!
కడప నగరపాలక సంస్థలో 6, 11, 13, 15, 16, 17, 24, 31, 34, 52, 55వ వార్డులకు, రాజంపేటలో 6, 12, 13, 14, 17, 19, 23, 24, 25, 26, 27వ వార్డులకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. తిరుపతి నగరపాలక సంస్థలో 1, 2, 3, 4, 5, 6, 9, 11, 12, 13, 14, 19, 55, 56, 57, 59, 65, 66వ వార్డులకు ఈ అవకాశం కల్పించారు.
అక్టోబర్ 23, 24 తేదీల్లో నామినేషన్లు :
అక్టోబర్ 23, 24 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఇప్పటికే ప్రకటించిన కేంద్రాలతో పాటు సంబంధిత కలెక్టరేట్లలోనూ నామినేషన్లు దాఖలు చేయవచ్చు.
కొత్తగా దాఖలైన నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 25న ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. కొత్తగా నామినేషన్ వేసిన అభ్యర్థులకు మాత్రమే అదే రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.
మైదుకూరుపై ప్రత్యేక నిర్ణయం :
మైదుకూరు పురపాలక సంఘంలో ఎన్నికల ప్రక్రియను తాజాగా ప్రారంభించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అక్కడ నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక పోలింగ్ తేదీని ప్రకటించనుంది. మరోవైపు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను యథావిధిగా నవంబర్ 3వ తేదీనే నిర్వహించాలా లేదా అనే అంశంపై కూడా ఎన్నికల సంఘం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం..


