- రెండు అల్పపీడనాలతో వానల మోత.. తుఫాన్ ముప్పు ఉందా?
- ఏపీలో భారీ వర్షాలు.. తెలంగాణలోనూ వానలు
- బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణం..
- మత్స్యకారులకు కీలక హెచ్చరిక
AP-Telangana Weather Alert : బంగాళాఖాతంలో వాతావరణం ఒక్కసారిగా మారుతోంది. ఇప్పటికే ఓ అల్పపీడనం కొనసాగుతుంటే.. మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలపై ఉత్కంఠ నెలకొంది. రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఈ హెచ్చరికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయంగా వాతావరణ శాఖ సూచిస్తోంది.
రెండు అల్పపీడనాలు.. వర్షాలు తీవ్రం? :
థాయ్‌లాండ్ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్రంలోకి ప్రవేశించింది. దీని ప్రభావంతో అక్టోబర్ 23 నుంచి ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. అది క్రమంగా బలపడి వాయుగుండంగా మారవచ్చని అంచనాలు నెలకొన్నాయి.
Read Also : AP Inter Exams 2027 : ఏపీ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంటర్ పరీక్షల ఫుల్ షెడ్యూల్ ఇదిగో.. ఎప్పటినుంచంటే?
ఇప్పటికే నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తాలో తేలికపాటి జల్లులు పడుతున్నాయి. కొత్త అల్పపీడనం కూడా బలపడితే వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశముంది. ముఖ్యంగా అక్టోబర్ 26 నుంచి కోస్తాంధ్రలో భారీ వర్షాలు, 3 నుంచి 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా..
తెలంగాణలోనూ వర్షాలు :
ఏపీలోనే కాకుండా తెలంగాణలోనూ వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ 27 నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చు. దీంతో రైతులు, ప్రయాణికులు, బయట పనులు చేసుకునేవారు అప్రమత్తంగా ఉండటం ఎంతైనా మంచిది.
మత్స్యకారులకు అలర్ట్ :
కొత్త అల్పపీడనం వాయుగుండంగా మారుతుందా? అక్కడి నుంచి తుఫాన్‌గా బలపడుతుందా? అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. రానున్న రెండు రోజుల్లో కదలికలు, తీవ్రతను పరిశీలించిన తర్వాతే మరింత స్పష్టమైన అంచనా రానుంది.
అయితే, సముద్రంలో పరిస్థితులు మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు అధికారిక హెచ్చరికలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండొద్దు.


