Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ నిర్ణయాన్ని కాదని రెబల్స్‌గా బరిలోకి దిగితే సస్పెన్షన్ వేటు తప్పదని ఆయన తేల్చిచెప్పారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వ్యూహాలు, ప్రచారం, అభ్యర్థుల ఎంపికపై పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను వేగవంతం చేసి, రెబల్స్ ఎవరూ పోటీలో లేకుండా చూడాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
మిత్రధర్మం, సమన్వయం.. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం:
కూటమి భాగస్వాములైన జనసేన, భాజపాలతో క్షేత్రస్థాయిలో పూర్తి సమన్వయంతో వ్యవహరించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. మిత్రపక్షాల అధికారిక అభ్యర్థులు ఉన్న చోట కూడా టీడీపీ రెబల్స్ లేకుండా చూడాలని ఆదేశించారు. సీట్ల సర్దుబాటు ప్రక్రియను వివాదాలు లేకుండా సాఫీగా పూర్తి చేయాలని, పొత్తు ధర్మాన్ని ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని సీఎం స్పష్టం చేశారు.
‘చెప్పాం.. చేస్తున్నాం’.. సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి:
సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని ‘చెప్పాం.. చేస్తున్నాం’ అనే ప్రధాన నినాదంతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. టికెట్లు దక్కని ఆశావహులకు నిరాశ చెందవద్దని, రాబోయే రోజుల్లో నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రజాదరణ, నిబద్ధత ఉన్న ఉత్తమ అభ్యర్థులనే ఎన్నికల బరిలోకి దింపాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.


