అధికార, ప్రతిపక్షాల మధ్య పొలిటికల్ వార్..

Must read

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్ఎస్‌ మధ్య రాజకీయ పోరు మరింత ముదురుతోంది. సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం, నిరసనలు, పరస్పర ఆరోపణలు చోటుచేసుకుంటున్న వేళ.. బీఆర్ఎస్‌ మరో వినూత్న కార్యక్రమంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యాలయంలో ‘మాక్ అసెంబ్లీ’ నిర్వహించి కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సమయంలో బీఆర్ఎస్‌ నేతలు నల్ల టీషర్టులు ధరించి సభకు వచ్చారు. వాటిపై కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు రాసుకుని నిరసన వ్యక్తం చేయాలని ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి నినాదాలతో ఉన్న టీషర్టులను సభలోకి అనుమతించబోమని మార్షల్స్‌ అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో సభ్యులు, మార్షల్స్‌ మధ్య తోపులాట చోటుచేసుకోవడం రాజకీయంగా చర్చకు దారితీసింది.

ఇదే సమయంలో బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఆ తర్వాత దళిత నాయకులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ వద్దకు వెళ్లి నిరసన కార్యక్రమం నిర్వహించడం, అక్కడ డప్పులు మోగించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీనికి ప్రతిగా గులాబీ పార్టీ శ్రేణులు పసుపు నీళ్లతో ఆ ప్రాంతాన్ని శుద్ధి చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ ఘటనలపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగాయి.

మరోవైపు అసెంబ్లీలో స్పీకర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు మధ్య జరిగిన వాగ్వాదం కూడా తీవ్ర చర్చకు దారితీసింది. సభలో వ్యాఖ్యలు, వ్యక్తిగత అంశాల ప్రస్తావనపై ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం సాగింది. దీంతో అసెంబ్లీ సమావేశాల్లో రాజకీయ వేడి మరింత పెరిగింది.

ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్‌ తన పార్టీ కార్యాలయంలో ‘మాక్ అసెంబ్లీ’ నిర్వహించింది. ఇందులో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ముఖ్యమంత్రి పాత్రలో వ్యవహరించగా.. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి బీఆర్ఎస్‌ ప్రతినిధిగా పలు అంశాలను లేవనెత్తారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును అనుకరిస్తూ వ్యంగ్యంగా విమర్శలు చేశారు.

మాక్ అసెంబ్లీలో జరిగిన సంభాషణలు కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు వచ్చాయి. జగదీశ్‌రెడ్డి కొన్ని అంశాలను ప్రస్తావించగా.. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వ్యంగ్యంగా స్పందిస్తూ, సబ్జెక్ట్‌ లేకుండా ఏదైనా మాట్లాడొచ్చని, కానీ అంశాన్ని ప్రస్తావించి దానికి సమాధానం చెప్పాలంటే మాత్రం ఎలా అనే రీతిలో వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.

అసెంబ్లీ లోపల అధికార పార్టీని నిలదీసే అవకాశం ఉన్నప్పటికీ.. పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా మాక్ అసెంబ్లీ నిర్వహించడంపై రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి. ఇది బీఆర్ఎస్‌ తనదైన శైలిలో కాంగ్రెస్‌కు ఇచ్చిన రాజకీయ కౌంటర్‌గా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజా సమస్యలు ఎంతవరకు పరిష్కారం అవుతాయనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.

ప్రజలు ఎన్నుకుని శాసనసభకు పంపిన ఎమ్మెల్యేలు, ప్రజా సమస్యలను సభలోనే బలంగా ప్రస్తావించి ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ కార్యాలయాల్లో నిర్వహించే మాక్ అసెంబ్లీలు రాజకీయంగా, సోషల్ మీడియాలో ప్రచారం పొందవచ్చని.. అయితే వాటి ద్వారా శాసనపరమైన ఫలితం పరిమితంగానే ఉంటుందని విశ్లేషిస్తున్నారు.

అదే సమయంలో గతంలో బీఆర్ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల పట్ల వ్యవహరించిన తీరును కాంగ్రెస్‌ నేతలు గుర్తుచేస్తూ విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం తమకు ఎదురవుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్‌ మాక్ అసెంబ్లీలు నిర్వహిస్తోందని వారు ఆరోపిస్తున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!