తెలంగాణ నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్.. రూ.1.75 లక్షల వరకు సబ్సిడీ.. జీవో 19 జారీ!

Must read

Telangana Government: విదేశాల్లో ఉద్యోగాలు సాధించే నిరుద్యోగ యువతకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం(Telangana Government) ముఖ్యమంత్రి విదేశీ ఉపాధి పథకం మార్గదర్శకాలను విడుదల చేసి, టామ్‌కామ్ ద్వారా అమలు చేసేందుకు జీవో 19 జారీ చేసింది. 2026–27లో 7 వేల మందికి సాయం లక్ష్యంగా పెట్టుకోగా, మొదటి కేటగిరీలో రూ.లక్ష వ్యయంలో 50 శాతంగా గరిష్ఠంగా రూ.50 వేల సబ్సిడీ అందిస్తారు. రెండో కేటగిరీలో భాషా శిక్షణ లేదా ప్రయాణ ఖర్చులపై రూ.3.50 లక్షల వ్యయంలో 50 శాతంగా గరిష్ఠంగా రూ.1.75 లక్షల వరకు సబ్సిడీ ఇస్తారు.

అర్హతలు.. రంగాలు.. కుటుంబంలో ఒక్కరికే అవకాశం:

18 నుంచి 40 ఏండ్ల వయసు ఉండి ఈడబ్ల్యూఎస్ ఆదాయ పరిమితి, స్థానికత, రెండేండ్ల పని అనుభవం, కనీసం ఆరు నెలల పాస్‌పోర్టు గడువు కలిగిన అభ్యర్థులు అర్హులు. నిర్మాణం, తయారీ, ఆటోమొబైల్, రవాణా, లాజిస్టిక్స్, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్, వైద్య సహాయక సేవలు, హోటళ్లు, పర్యాటకం, మరమ్మతులు, గృహ సేవల రంగాల్లో అవకాశాలు కల్పిస్తారు. రేషన్ కార్డు ఆధారంగా కుటుంబంలో ఒక్కరికే సబ్సిడీ వర్తించనుండగా, మహిళలకు 33.33 శాతం, దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తులు.. 30 రోజుల్లో ఎంపిక ప్రక్రియ:

టామ్‌కామ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తూ, ఆధార్ అనుసంధాన బ్యాంకు ఖాతాలకు నేరుగా సబ్సిడీ మొత్తాన్ని జమ చేస్తారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి కమిటీల ఆమోదంతో 30 రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తారు. బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తూనే, తప్పుడు పత్రాలు సమర్పించినా మధ్యలో వైదొలిగినా సబ్సిడీ నిలిపివేసి తిరిగి వసూలు చేస్తారు.

రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల పర్యవేక్షణ:

పథకం పక్కా అమలు కోసం టామ్‌కామ్ ఎండీ అధ్యక్షతన రాష్ట్రస్థాయి కమిటీతో పాటు 33 జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తారు.
అభ్యర్థుల ఎంపిక, విదేశీ సంస్థల విశ్వసనీయత, వీసాలు, సబ్సిడీ చెల్లింపులను ఈ కమిటీలు పర్యవేక్షిస్తాయి. విదేశాల్లో ఉద్యోగాల్లో చేరిన వారి పురోగతిపై ప్రతి మూడు నెలలకు జిల్లా ఉపాధి అధికారులు టామ్‌కామ్‌కు నివేదిక అందజేస్తారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article